కేసీఆర్‌కు కరోనా వస్తే యశోదా.. పేదవారికేమో ప్రభుత్వ ఆస్పత్రులా..?

దిశ, సిరిసిల్ల : కేసీఆర్ నీకు కరోనా వస్తే య‌శోద ఆసుప‌త్రికి వెళ్తావు.. పేద‌వారు మాత్రం ప్రభుత్వ ఆసుప‌త్రికి వెళ్లాలా..? అని వైఎస్ ష‌ర్మిల ప్రశ్నించారు. నీకో న్యాయం పేదవారికి ఓ న్యాయమా..? అంటూ ఫైర్ అయ్యారు. శుక్రవారం సిరిసిల్ల నియోజకవర్గంలో వైఎస్ షర్మిల తొలిసారిగా పర్యటించారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌లోని కరోనా మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్పొరేట్ ఆస్పత్రిలో పేదలకు ఉచిత వైద్యం అందించాలని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం […]

Update: 2021-06-25 07:10 GMT

దిశ, సిరిసిల్ల : కేసీఆర్ నీకు కరోనా వస్తే య‌శోద ఆసుప‌త్రికి వెళ్తావు.. పేద‌వారు మాత్రం ప్రభుత్వ ఆసుప‌త్రికి వెళ్లాలా..? అని వైఎస్ ష‌ర్మిల ప్రశ్నించారు. నీకో న్యాయం పేదవారికి ఓ న్యాయమా..? అంటూ ఫైర్ అయ్యారు. శుక్రవారం సిరిసిల్ల నియోజకవర్గంలో వైఎస్ షర్మిల తొలిసారిగా పర్యటించారు. ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌లోని కరోనా మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్పొరేట్ ఆస్పత్రిలో పేదలకు ఉచిత వైద్యం అందించాలని వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టారన్నారు. తన తండ్రిది పెద్ద మనసని.. కుటుంబాలని నిలబెట్టిన పథకం ఆరోగ్యశ్రీ అని చెప్పుకొచ్చారు. అలాంటిది నేడు తెలంగాణలో ఆరోగ్యశ్రీ అందడం లేదని వైఎస్ షర్మిల మండిప‌డ్డారు.

రాష్ట్రంలో వేలాది మంది క‌రోనాతో మ‌ర‌ణించార‌ని, వైద్యానికి లక్షలకు లక్షలు ఖర్చువుతున్నాయన్నారు. మృతుల కుటుంబాలు వైద్యం కోసం చేసిన అప్పులు కట్టలేక ఆస్తులు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ డబ్బునంతా ఎవరు చెల్లిస్తారో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి పేదలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పేద వాళ్ళను తెలంగాణ సర్కారు ఆదుకోవడం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్‌ నుంచి బయటకు వస్తే నిజాలు తెలుస్తాయని విమర్శించారు. మీకు కరోనా వస్తే మాత్రం యశోద ఆసుపత్రికి వెళ్తారు.. పేదవారు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలా..? అని కేసీఆర్‌ను ప్రశ్నించారు.

నీకో న్యాయం పేద వారికి ఓ న్యాయమా..? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని తాము విన్నవిస్తున్నా దున్నపోతు మీద వాన పడ్డ చందంగా కేసీఆర్ వ్యవహారశైలి ఉందన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో కాకుండా ఆయుష్మాన్ భారత్‌లో చేర్చి చేతులు దులుపుకున్నారని గుర్తుచేశారు. ఆయుష్మాన్ భారత్ వల్ల తెలంగాణలోని 26 లక్షల కుటుంబాలకే లబ్ధి చేకూరుతుందని, అదే ఆరోగ్యశ్రీ వల్ల 80 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతాయన్నారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని మరోమారు డిమాండ్ చేస్తున్నామన్నారు. ఒకప్పుడు ఆయుష్మాన్ భారత్ ఒట్టి దిక్కుమాలిన పథకం అన్న కేసీఆర్.. ఇప్పుడు అదే పథకం ఎందుకు అమలు చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. అలాగే కరోనాతో చనిపోయిన వారికి ఐదు లక్షలు ఎక్సగ్రేషియా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు.

Tags:    

Similar News