బస్సైనా...విమానమైనా తప్పని సీటు కొట్లాట

సాధారణంగా సీటు కోసం సిగపట్లు..ముష్టి యుద్దాలు ఆర్టీసీ బస్సుల్లో చూస్తుంటాం

Update: 2024-10-15 12:01 GMT

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా సీటు కోసం సిగపట్లు..ముష్టి యుద్దాలు ఆర్టీసీ బస్సుల్లో చూస్తుంటాం. అయితే ఈ తరహా కొట్లాటకు బస్సైనా...ఎయిర్ బస్సైనా ఒకటేనన్న తీరుగా వ్యవహరించారు కొందరు ప్రయాణికులు. విమానంలో ప్రయాణికులు సీట్ల కోసం చితక్కొట్టుకున్న న ఘటన వైరల్ గా మారింది. తైవాన్‌ నుంచి అమెరికాలోని కాలిఫోర్నియాకు వెళ్లే విమానంలో సీటు విషయంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. మంగళవారం తైపీ సిటీ నుండి శాన్ ఫ్రాన్సిస్కోకు బయలుదేరిన ఈవిఏ ఎయిర్ ఫ్లైట్ బీఆర్08లో ఈ సంఘటన జరిగిందని న్యూయార్క్ పోస్ట్ తెలిపింది. విమానంలో పక్కనే ఉన్న వ్యక్తి దగ్గడం ప్రారంభించిన తర్వాత ఒక ప్రయాణికుడు సీట్లు మారాలని నిర్ణయించుకోవడంతో గొడవ మొదలైంది. అసలు సీటులో ఉన్న వ్యక్తి తిరిగి రావడంతో తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వివాదం కాస్తా ముష్టి యుద్దానికి దారితీసింది.

ప్రయాణికులు ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలతో దాడి చేసుకున్నారు. ఘర్షణ పడుతున్న ఇద్దరు వ్యక్తులను వేరు చేసేందుకు సిబ్బందికి సహాయం చేసేందుకు పలువురు ప్రయాణికులు రంగంలోకి దిగారు. ఘర్షణ తర్వాత కూడా ఆ ఇద్దరు ప్రయాణికులు పరస్పరం దూషించుకున్నారు. విమానం శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో దిగిన తర్వాత గొడవ పడిన ఇద్దరు ప్రయాణికులను శాన్ ఫ్రాన్సిస్కో పోలీసులకు అప్పగించినట్లు న్యూయార్క్ పోస్ట్ తెలిపింది.


Similar News