Hurricane Milton: 15 అడుగుల మేర ఫ్లోరిడాను ముంచెత్తనున్న మిల్టన్.. వైరలవుతోన్న భయానక వీడియో
హరికేన్ మిల్టన్ ఫ్లోరిడాను ఏ స్థాయిలో ముంచెత్తనుందో చెబుతూ ఓ వాతావరణ సంస్థ రూపొందించిన 3డీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
దిశ, వెబ్ డెస్క్: హరికేన్ మిల్టన్ (Hurricane Milton) ఫ్లోరిడాలో బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికీ దీనిని కేటగిరి 5కు చెందిన తుపానుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్లోరిడా తీరప్రాంతాల్లో హరికేన్ ధాటికి అలలు ఎగసి పడుతున్నాయి. ప్రచండ గాలులతో కూడిన భీకర వర్షాలు కురుస్తుండటంతో.. అక్కడి ప్రజలు ఇళ్ల నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదు. పలు ప్రాంతాల్లో హై ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు అధికారులు. గడిచిన వందేళ్లలో చూసిన అతిపెద్ద తుపాన్లలో ఇది కూడా ఒకటి కానుందని బైడెన్ (joe biden) ఇప్పటికే తెలిపారు. తీరప్రాంతాల్లో ఉన్నవారు, హరికేన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నవారు వెంటనే ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ అయ్యాయి. అట్లాంటిక్ చరిత్రలోనే నాల్గవ అతితీవ్రమైన తుపానుగా మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
కాగా.. హరికేన్ మిల్టన్ ఫ్లోరిడాను ఏ స్థాయిలో ముంచెత్తనుందో చెబుతూ.. వాతావరణ సంస్థ రూపొందించిన 3డీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వీడియోలో హరికేన్ కారణంగా కురుస్తున్న వర్షాలకు 3 అడుగుల ఎత్తు వరకూ మునిగితే ఎలా ఉంటుంది, 6 అడుగుల ఎత్తు వరకూ మునిగితే పరిస్థితులు ఎలా ఉంటాయి, 9 అడుగుల ఎత్తువరకూ మునిగితే ఎలా ఉంటుందో వివరించారు. ఆ వీడియో చూడటానికే చాలా భయంకరంగా ఉంది. తొలుత 9 అడుగుల వరకూ హరికేన్ ముంచెత్తనుందన్న వాతావరణ శాఖ.. తర్వాత 15 అడుగుల వరకూ హరికేన్ ముంచెత్తుందన్న హెచ్చరించింది నిజంగానే హరికేన్ కారణంగా ఈ స్థాయిలో వరదలు వస్తే పరిస్థితి ఏంటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నేటి అర్థరాత్రి 2-3 గంటల మధ్య హరికేన్ ఫ్లోరిడాకు సమీపంలో తీరందాటనున్నట్లు వాతావరణ కేంద్రాలు వెల్లడించాయి.