ఏకే 47.. ప్రపంచంలోనే అత్యంత డేంజర్ వెపన్
ప్రపంచంలో అత్యంత ప్రమాదకర ఆయుధం ఏది అని అడిగితే ఎవరైనా అణ్వాయుధం లేదా జీవ రసాయన ఆయుధాలు అని చెప్తారు.
ప్రపంచంలో అత్యంత ప్రమాదకర ఆయుధం ఏది అని అడిగితే ఎవరైనా అణ్వాయుధం లేదా జీవ రసాయన ఆయుధాలు అని చెప్తారు. కానీ, ఒక ఆయుధం వల్ల ఏటా 2.5లక్షలమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన ఆయుధంగా ఐక్యారాజ్యసమితి ప్రకటించడమేకాదు.. వియత్నాం యుద్ధంలో అమెరికాను సైతం గడగడలాడించిన ఆయుధం.. ఏకే 47. రష్యాలో తయారైన ఈ ఆయుధం ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ ఫేవరెట్ వెపన్ గా మారింది. ఇప్పటివరకు అత్యధిక మార్పులు చోటుచేసుకున్న ఆయుధంకూడా ఇదే. అత్యధిక దేశాల్లో ఉత్పత్తి అవుతున్నది కూడా ఇదే కావడం గమనార్హం. చాలా దేశాల్లో సంప్రదాయ సైనిక ఆయుధంగా మారింది. అయితే, అసాంఘిక శక్తుల చేతుల్లో పడటంతోనే వినాశనానికి కారణం అవుతున్నది. ఏదిఏమైనా ప్రపంచ మానవ చరిత్రలో అత్యంత సక్సెస్ వెపన్ గా గుర్తింపు పొందిన ఏకే 47పై ప్రత్యేక కథనం. -హరీశ్ ఎస్పీ
జర్మనీ తుపాకీకి ఇది నకలా?
ఏకే 47 ఓ నకలు అని పశ్చిమదేశాల్లో విమర్శలు వచ్చాయి. జర్మనీ తయారీ ఎస్టీజీ 44ను కలాష్నికోవ్ కాపీ కొట్టాడని విమర్శించారు. కానీ, ఎస్టీజీ 44లో అనేక లోపాలు ఉన్నాయి. 1944లోనే జర్మనీ ఈ రకం ఆయుధాలు తయారీ చేసినా.. ఏకేతో వీటిని పోల్చలేం. తుపాకీలో బుల్లెట్లు ఉండే భాగాన్ని క్యాట్రిడ్జ్ అంటారు. తూటాలు అయిపోయాక దీనిని మార్చి మరొకటి అమర్చాల్సి ఉంటుంది. అయితే, ఈ తుపాకీలో ప్రధాన సమస్య అదే. తూటాలు కాల్చడం అయిపోయాక క్యాట్రిడ్జ్ తీయడం సైనికులకు ఇబ్బందిగా ఉండేది. కానీ, చూడటానికి ఏకే 47, ఎస్టీజీ 44 రెండూ ఒకేలా ఉంటాయి. నిజానికి కలాష్నికోవ్ ఎస్టీజీ 44ను స్ఫూర్తిగా తీసుకుని ఏకే 47 తయారుచేశారు. తూటాలు వెంటవెంటనే కాల్చినా ఎటువంటి ఆటంకాలు లేకుండా అభివృద్ధి చేయడంతో ఏకే సక్సెస్ వెపన్ గా నిలిచింది.
ఎవరీ కలాష్నికోవ్..
1919లో అల్టాయి పర్వతప్రాంతంలోని కుర్యా అనే గ్రామంలో మిఖాయిల్ టిమోఫెయెవిచ్ కలాష్నికోవ్ జన్మించారు. ఇది ప్రస్తుతం రష్యా, కజకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. ఆయన తండ్రి టిమోఫెయ్ అలెక్సాండ్రోవిచ్ కలాష్నికోవ్ తల్లి కవెరినా. వీరికి 19మంది పిల్లల్లో కలాష్నికోవ్ 17వవాడు. అయితే, వీరిలో యుక్త వయస్సు వచ్చేనాటికి ఆరుగురు పిల్లలు మాత్రమే బతికారు. అలెక్సాండ్రోవిచ్ ఓ మోతుబరి రైతు. అయితే, రష్యా సామ్రాజ్యం అంతరించి.. కమ్యూనిస్ట్ పాలన ప్రారంభం అయ్యాక.. భూమి పంపకాల్లో భాగంగా వీరి కుటుంబాన్ని సైబీరియా ప్రాంతంలోని టామ్స్క్ ఒబ్లాస్ట్ అనే ప్రాంతానికి తరలించింది. అక్కడ వీరు సామూహిక వ్యవసాయంతోపాటు వేట వృత్తిగా ఎంచుకున్నారు. అలెక్సాండ్రోవిచ్ వద్ద వేట తుపాకులు ఉండటంతో కలాష్నికోవ్ చిన్నతనం నుంచే ఆ తుపాకుల పనితీరును ఆసక్తిగా గమనించేవాడు. సైబీరియాలో ఉండటం ఇష్టంలేక తిరిగి తాను పుట్టిన ఊరైన కుర్యా వచ్చి.. అక్కడ ఓ ట్రాక్టర్ సర్వీసింగ్ స్టేషన్ లో ఉద్యోగం సంపాదించాడు. అక్కడ పనిముట్ల ఉపయోగంలో నిపుణుడు అయ్యాడు. రెడ్ ఆర్మీలో ఇంజినీరింగ్ విభాగంలో ఖాళీలు ఉండటంతో అందులో చేరిపోయాడు. తొలుత యుద్ధ ట్యాంక్ మెకానిక్‌గా కెరీర్ ప్రారంభించారు. రెండో ప్రపంచయుద్ధం సమయంలో ట్యాంక్ కమాండర్‌గా పదోన్నతి పొందారు. ఆ యుద్ధంలో గాయపడి.. తేలికపాటి ఆయుధాల తయారీ కర్మాగారంలో పనిచేశారు. తొలుత జర్మన్ కు చెందిన ఎస్టీజీ 44 అనే ఆటోమేటిక్ ఆయుధం స్ఫూర్తిగా ఒక డిజైన్ తయారుచేశారు. అయితే, దానిని అధికారులు తిరస్కరించినా.. కలాష్నికోవ్ పట్టుదల చూసి ఆయన పరిశోధనలకు అనుమతి ఇచ్చారు. ఈ క్రమంలో ఏకే 47 ఆయుధం డిజైన్ చేశారు. అలా ప్రారంభించిన ఆయన ప్రస్థానంలో రష్యా ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ స్థాయికి ఎదిగారు. రష్యా హీరోగా గుర్తింపు పొందారు. తాను చనిపోయే(2013) వరకు పలు రకాల ఆయుధాల అభివృద్ధిలో భాగమయ్యారు. ఆయన ఏకే 47లోనూ అనేక మార్పులు చేస్తూ పలు ఆయుధాలు తయారు చేశారు. రష్యాలో తయారైన 150 రకాల ఆయుధాల డిజైన్లకు ఆయన సూచనలు, సహకారం అందించారు.
ఏకే అవసరం ఎందుకు?
రెండో ప్రపంచయుద్ధంలో జర్మనీతో రష్యా గెరిల్లా యుద్ధం చేసింది. దీంతో రెడ్ ఆర్మీ సైనికులకు ఎక్కువ దూరం నుంచి కాల్చే తుపాకుల కన్నా శత్రువుకు సమీపంలోకి వెళ్లి కాల్చే తుపాకుల అవసరం ఎక్కువ ఏర్పడింది. అప్పటివరకు మోసిన్ నాగంట్ అనే రైఫిల్ ఎక్కువ వాడేవాళ్లు. మ్యానువల్ కావడంతోపాటు ఆరు గుళ్ల క్యాట్రిడ్జ్ మాత్రమే ఉండటంతో శత్రువును దీటుగా ఎదుర్కోలేకపోయారు. అప్పటికే జర్మనీ వద్ద హెవీ మెషీన్ గన్, మీడియంతోపాటు లైట్ మెషీన్ గన్ పదులసంఖ్యలో ఉన్నాయి. ఆయుధ సామర్థ్యంలో జర్మనీ అగ్రభాగాన ఉండటంతో రష్యా పీపీఎస్ హెచ్ 41, పీపీఎస్ హెచ్ 42 రకం ఆయుధాలు వాడింది. ఇవి శత్రువును దెబ్బతీసేందుకు ఉపయోగపడినా.. ఎక్కువగా మొరాయించడంతో రష్యా సైన్యం కొత్త ఆయుధాల రూపకల్పనకు అడుగులు వేసింది. ఈ క్రమంలోనే తేలికపాటి ఆయుధాల డిజైన్లు తయారు చేయాలని రహస్యంగా పోటీలు నిర్వహించింది. ఈ ట్రయల్స్ లోనే ఏకే 47 విజయం సాధించింది. నీళ్లు, ఇసుకలో వేసి కాల్చినా బాగా పనిచేయడం.. ఇంజినీరింగ్ టెక్నాలజీ కూడా చాలా సులభంగా ఉండటం.. రష్యాలో అందుబాటులో ఉన్న బుల్లెట్లు వాడే అవకాశం ఉండటంతో ఈ ఆయుధానికి సైన్యాధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
భారత సైన్యం ఎందుకు వాడదు?
భారత సైన్యంలో సంప్రదాయ ఆయుధంగా ఎస్ఎల్ఆర్ అనే ఆయుధం వాడేవారు. ఇటీవల దానినే అభివృద్ధి చేసిన ఇన్సాస్ వాడుతున్నది. ఏకే 47 అద్భుతమైన ఆయుధమే అయినా.. సంప్రదాయ సైన్యం వాడకంలో అనేక ఇబ్బందులు ఉంటాయి. సైన్యం సరిహద్దుల్లో కాపలా కాస్తుంటుంది. ఎవరైనా సరిహద్దు దాటి వచ్చే ప్రయత్నం చేస్తే వారిని కాల్చేవేయాల్సి ఉంటుంది. యుద్ధం వంటి పరిస్థితుల్లోనూ శత్రువును దూరం నుంచి నిలువరించడమే తొలుత ప్రయారిటీగా తీసుకుంటారు. ఈ రెండు అంశాల్లో ఏకే రకం ఆయుధాల ఉపయోగం తక్కువ. ఎందుకంటే ఎస్ ఎల్ ఆర్/ ఇన్సాస్ ఆయుధాలతో పోల్చితే ఏకే 47 దూరంగా ఉండే టార్గెట్ ని కచ్చితత్వంతో కాల్చలేదు. సమీప దూరంలో ఉన్నప్పుడు పైగా శత్రువును కోలుకోలేకుండా చేసేందుకు ఒక్కసారిగా తూటాల వర్షం (బరస్ట్ షాట్) కురిపించవచ్చు. కానీ, నిదానంగా తూటాలు కాపాడుకుంటూ శత్రువును నిలువరించాలంటే ఎస్ ఎల్ ఆర్/ ఇన్సాస్ ఆయుధాలే బెస్ట్ అని సైనిక నిపుణులు చెప్తారు. అందుకే స్పెషల్ యూనిట్లకు మాత్రమే వీటిని అందజేస్తారు. అయితే, ఈ ఏడాది రష్యాతో ప్రధాని మోడీ కుదుర్చుకున్న ఒప్పందం మేరకు 35వేల ఏకే 203 రకం ఆయుధాలు భారత సైన్యం అందుకుంటుంది. వాటిని కూడా యూపీలోని కాన్పూర్‌లో తయారు చేయనున్నారు.
మీకు తెలుసా?
= ఏకే 47లో ఏకే అంటే ఆటోమేటిక్ కలాష్నికోవ్.. 47 అంటే 1947లో రష్యా సైన్యంలో ఆ ఆయుధానికి పరీక్షలు నిర్వహించారు. అందుకే దానికి ఏకే 47 అన్న పేరు వచ్చింది. సోవియట్ రష్యా సైన్యంలో తేలికపాటి ఆయుధాల డిజైనర్ మిఖాయిల్ కలాష్నికోవ్ దీనిని అభివృద్ధి చేశారు. అప్పటికే ఈ మోడల్‌లో పలు ఆయుధాలు తయారీ అయినా, వాటిలో మన్నికైనదిగా కలాష్నికోవ్ గుర్తింపు పొందింది. నాటి నుంచి నేటివరకు ఆయుధాల్లో ఏకే 47కి ప్రత్యేకత ఉన్నది. ఏకేఎం పేరిట అనేక రకాల మార్పులు పొందినా చరిత్రలో మాత్రం ఏకే 47గా చిరస్థాయిలో నిలిచిపోయింది.
= 1947లో సైన్యం పరీక్షలు తట్టుకుని నిలిచింది. 1948లో సైనిక అవసరాల కోసం తయారీతోపాటు.. కొన్ని సైనిక యూనిట్లకు ఆయుధాలను అప్పగించారు. 1949లో రష్యా సైన్యం అధికార ఆయుధంగా మారడంతోపాటు వార్సా ఒప్పందం కుదుర్చుకున్న దేశాలకు కూడా ఏకే 47 తుపాకులు అందాయి.
= ఏకే ప్రపంచంలో అత్యధిక దేశాల సైన్యాలు వాడుతున్న ప్రధాన ఆయుధం.
= ఐదు ఖండాల్లో దాదాపుగా 5 కోట్లనుంచి 7కోట్ల ఏకే 47 తుపాకులు ఉన్నాయి. వీటిని సైనికులు, తిరుగుబాటుదారులతోపాటు స్మగ్లర్లు, అసాంఘిక శక్తులు ప్రధానంగా వినియోగిస్తున్నారు. మొత్తం ప్రపంచంలో 10కోట్ల ఏకే రకం తుపాకులు ఉన్నాయట. ఇవి అధికారిక లెక్కలు మాత్రమే. అంటే ఇంతకు పదిరెట్లు కూడా ఉండొచ్చని అంచనా.
= ప్రపంచంలో అత్యధికంగా అక్రమంగా విక్రయించే ఆయుధం ఏకే 47.
= ప్రపంచంలోని అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసే అతి తక్కువ ఆయుధాల్లో ఇదీ ఒకటి.
= ఏకే 47 ఆయుధాలతో చేస్తున్న దాడుల్లో ఏటా 2.5 లక్షలమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే అణ్వాయుధాలతో చనిపోయిన వారికంటే దీనివల్ల చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువ కావడం బాధాకరం.
= కొన్ని దేశాల్లో ప్రభుత్వం ఆజమాయిషీ లేకపోవడం.. అస్తవ్యస్త పాలన కారణంగా లక్షలకొద్దీ ఆయుధాలు అసాంఘికశక్తుల చేతుల్లోకి వెళ్లాయి. వాటివల్ల ప్రజలు నిత్యం భయాందోళనల్లో బతుకలీడుస్తున్నారు.
= ఏకే 47 కేవలం సైనికులు మాత్రమే ఫేవరేట్ ఆయుధం కాదు..
= ప్రపంచ మానవ చరిత్రలో అత్యంత సక్సెస్ ఫుల్ ఆయుధాల జాబితాలో మొట్టమొదటిది ఏకే 47.
= ఏకే 47కు ఉన్న రూపును మొదట తయారు చేసింది కలాష్నికోవ్ కాదు. కానీ, అంతకుముందు ఇతరులు తయారుచేసిన అనేక మోడళ్లు సైనిక పరీక్షలో విఫలం కావడం.. ఏకే 47 ట్రిగ్గర్ మెకానిజం, సేఫ్టీ క్యాచ్, రొటేటింగ్ బోల్ట్, గ్యాస్ చాంబర్ ఇలా ప్రతీది అద్భుతంగా సెట్ కావడం ఏకే 47 ప్రత్యేకత. ఇలా ప్రతీది అతికినట్టు సరిపోవడం.. తయారీ ఖర్చు తక్కువగా ఉండటంపైగా ఎక్కువకాలం పాటు మన్నికగా ఉండటంతో ఈ ఆయుధం అందరికీ ఫేవరెట్ గా నిలిచింది.
= రష్యా మినహా ఇతర దేశాల్లో ఏకే 47 రిపేర్ చేయడం కన్నా కొత్తది కొనుక్కోవడానికి తక్కువ ఖర్చు అవుతుందట.
= బద్దశత్రువైన రష్యా తయారీ ఆయుధాలను అమెరికా సైన్యం వినియోగిస్తున్నది. ఆ దేశ ఆయుధాల విక్రయ కేంద్రాల్లోనూ ఇది టాప్ సేల్‌లో ఉందట.
= చైనా ఏకే 47 క్లోన్ తయారుచేసింది. దానిపేరు టైప్ 56. ఇది అచ్చం ఏకే 47 కాపీయే.