యూఎస్ సైనికుడి ఆత్మహత్యాయత్నం: గాజాలో యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన
అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వెలుపల అమెరికా వైమానిక దళ సైనికుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గాజాలో జరుగుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ దౌత్య కార్యాలయం గేటు ఎదుట తనకు తానే నిప్పంటించుకున్నాడు.
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వెలుపల అమెరికా వైమానిక దళ సైనికుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గాజాలో జరుగుతున్న యుద్ధానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ దౌత్య కార్యాలయం గేటు ఎదుట తనకు తానే నిప్పంటించుకున్నాడు. వెంటనే స్పందించిన సెక్యురిటీ సిబ్బంది మంటలను ఆర్పి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ‘నేను ఇకపై గాజాలో జరుగుతున్న మారణహోమంలో పాల్గొనను. పాలస్తీనా విముక్తి కావాలి. దాడికి నిరసనగా ప్రస్తుతం ప్రమాదకరమైన చర్యలు తీసుకోబోతున్నాను. ఫ్రీ పాలస్తీనా’ అని నిప్పంటించుకునే ముందు ఆయన నినాదాలు చేసినట్టు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ వ్యక్తి సైనికుడా కాదా అన్న విషయాన్ని యూఎస్ వైమాణిక దళం ధ్రువీకరించలేదు. మరోవైపు ఆ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దానిని యూఎస్ తొలగించింది.
ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయంలో నిరంతరం నిరసనలు
గతేడాది అక్టోబర్‌లో ఇజ్రాయెల్-గాజా యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం నిరంతరం నిరసనలకు వేదికగా మారింది. యూఎస్‌లోని పాలస్తీనియన్ అనుకూలురు, ఇజ్రాయెల్ మద్దతు దారులు ఆందోళనలు నిర్వహిస్తునే ఉన్నారు. అంతేగాక ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 29000మందికి పైగా పాలస్తీనియన్లు మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. సంక్షోభం తీవ్రతరం కావడంతో కాల్పుల విరమణ పాటించాలని అంతర్జాతీయంగా డిమాండ్లు వచ్చాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో గాజాలో తక్షణ కాల్పుల విరమణ ప్రతిపాదనపై ఈ నెల 20న ఓటింగ్ జరగగా వీటో అధికారాన్ని ఉపయోగించి అమెరికా దానిని తిరస్కరించింది.