సంచలనం రేపి, బ్యాన్ అయిన ఈ పుస్తకం కొత్త ఎడిషన్ కోటి రూపాయలకు పైనే..?!
ఇందులో విషయం తరతరాల అణిచివేతను ప్రశ్నిస్తుంది. 'Unburnable' edition of Margaret Atwood's 'The Handmaid's tale'
దిశ, వెబ్‌డెస్క్ః అన్ని ఆయుధాలకీ ఎక్స్పైరీ డేట్ ఉండొచ్చు, కానీ అక్షరం అనేది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఎన్ని సార్లు తగలబెట్టినా నిప్పు కణికలా మండుతూనే ఉంటుంది. ఇలాంటి ఓ సంచలనాత్మక పుస్తకం గురించే ప్రస్తుతం ప్రపంచం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది. విక్రమార్కుడి భుజంపై దెయ్యంలా అధికారంపై ప్రశ్నల వర్షం కురిపించే ఏ రూపమైన రాజ్య వ్యతిరేకతను మూటకట్టుకోవాల్సిందే! అలాంటిదే, సంచలన రచయిత్రి మార్గరెట్ అట్‌వుడ్ రాసిన ది హ్యాండ్‌మెయిడ్స్ టేల్ అనే రచన. తాజాగా, ఈ పుస్తకం కొత్త ఎడిషన్ $130,000కి అంటే దాదాపు రూ. 10,112,900లకు వేలం వేశారు. ఈ ఆదాయాన్ని ప్రపంచవ్యాప్తంగా స్వేచ్ఛా వ్యక్తీకరణ కోసం వాదించే సంస్థ 'పెన్ అమెరికా'కు ఇవ్వనున్నారు.
'ది హ్యాండ్‌మెయిడ్స్ టేల్' మొదటిసారిగా 1985లో విడుదలయ్యింది. ఇందులో విషయం తరతరాల అణిచివేతను ప్రశ్నిస్తుంది. 'రిపబ్లిక్ ఆఫ్ గిలియడ్' అని పిలిచే క్రూరమైన పితృస్వామ్యానికి సంబంధించిన డిస్టోపియన్ నవలగా ఇది అంతర్జాతీయంగా సంచలనమయ్యింది. ఈ పుస్తకం ప్రచురించినప్పటి నుండి అనేక మార్లు నిషేధాలకు లోను కాగా, ఎన్నోసార్లు ఈ రచనని తగలబెట్టారు. అయితే, ఎన్ని వ్యతిరేకతలు వచ్చినప్పటికీ పుస్తకం మాత్రం పాఠకుల ఆదరణ నుండి దూరం కాలేదు. అయితే, ఈసారి సరికొత్త ఎడిషన్ మరింత సామర్థ్యంతో ముందుకు రావడం విశేషం. 384-పేజీల ఈ పుస్తకంలో ప్రధానంగా సినీఫాయిల్, ప్రత్యేకంగా రూపొందించిన అల్యూమినియం ఉత్పత్తితో పేజీలను తయారుచేశారు. ఇప్పుడు "ది హ్యాండ్‌మెయిడ్స్ టేల్' 'అన్‌బర్న్‌బుల్' బుక్‌గా పాఠకులను ఆకర్షిస్తోంది. PEN అమెరికా ప్రోత్సాహంతో ముద్రించిన ఈ లిమిటెడ్ ఎడిషన్లను ఇప్పుడు ఎలాంటి మంటా కాల్చలేదు! ప్రత్యేక ఎడిషన్‌పై రూపొందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో 5 బిలియన్ల వ్యూవ్స్‌ను అందుకుంది. అయితే, ఇది ఎప్పటిలాగే మరింత అవగాహనను పెంచుతుందని, సహేతుకమైన చర్చకు దారితీస్తుందని ఆశిస్తున్నట్లు పెన్ అమెరికా ఒక ప్రకటనలో పేర్కొంది.