Ukraine attack: రష్యాపై ఉక్రెయిన్ భారీ దాడి.. 144 డ్రోన్లతో అటాక్

రష్యా ఉక్రెయిన్ యుద్ధం రోజు రోజుకూ ఉధృతమవుతోంది. శాంతి చర్చలు జరపాలని పలు దేశాలు సూచిస్తున్నప్పటికీ దాడులు ఆగడం లేదు.

Update: 2024-09-10 16:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా ఉక్రెయిన్ యుద్ధం రోజు రోజుకూ ఉధృతమవుతోంది. యుద్దాన్ని ఆపి శాంతి చర్చలు జరపాలని పలు దేశాలు సూచిస్తున్నప్పటికీ దాడులు మాత్రం ఆగడం లేదు. మంగళవారం రష్యాపై ఉక్రెయిన్ భారీ దాడికి పాల్పడింది. రష్యా రాజధాని మాస్కోతో సహా 8 ప్రావీన్సులను లక్ష్యంగా చేసుకుని 144 డ్రోన్లను ప్రయోగించింది. మాస్కోపై 20, ఇతర ప్రాంతాల్లో 124 డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందడంతో పాటు పలు ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఈ డ్రోన్లు అన్నింటినీ రష్యా కూల్చి వేసినట్టు తెలుస్తోంది. దాడుల అనంతరం మాస్కో విమానాశ్రయం నుంచి 50కి పైగా విమానాలను దారి మళ్లించారు. నాలుగు ఎయిర్ పోర్టుల్లో కార్యకలాపాలను మూసివేశారు.

డ్రోన్ దాడుల వల్ల మాస్కో ప్రాంతంలోని రామెన్‌స్కోయ్ జిల్లాలో రెండు ఎత్తైన భవనాలు దెబ్బతిన్నాయని, ఫ్లాట్‌లు అగ్నికి ఆహుతయ్యాయని మాస్కో గవర్నర్ ఆండ్రీ వోరోబయోవ్ తెలిపారు. 43 మందిని తాత్కాలిక వసతి కేంద్రాలకు తరలించినట్టు వెల్లడించారు. ఈ దాడికి ప్రతీకారంగా రష్యా కూడా 46 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై దాడి చేసింది. అయితే ఇందులో 38 డ్రోన్లను ఉక్రెయిన్ కూల్చి వేసింది. అంతకుముందు గత నెల 31న కూడా ఉక్రెయిన్ 150కి పైగా డ్రోన్లతో రష్యాపై దాడి చేసింది. రెండున్నరేళ్ల నుంచి జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ ఇంత పెద్ద సంఖ్యలో డ్రోన్లతో దాడి చేయడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. 


Similar News