Iran’s Quds Force Leader: ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ మృతి..!
బీరూట్ లో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ కు షాక్ తగిలింది. ఇరాన్ తరఫున విదేశాల్లో ఆపరేషన్లు నిర్వహించే ఐఆర్జీసీ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ హతమైనట్లు తెలుస్తోంది.
దిశ, నేషనల్ బ్యూరో: బీరూట్ లో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇరాన్ కు షాక్ తగిలింది. ఇరాన్ తరఫున విదేశాల్లో ఆపరేషన్లు నిర్వహించే ఐఆర్జీసీ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ హతమైనట్లు తెలుస్తోంది. ఐఆర్జీసీ చీఫ్ ఇస్మాయిలీ ఖానీ ఇటీవల బీరుట్‌పై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు చేసిన దాడిలో మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే.. ఇరాన్ సైన్యానికి షాక్ తగులుతోంది. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ దాడుల సందర్భంగా.. హెజ్‌బొల్లాకు సాయం చేసేందుకు గతవారం ఖుద్స్ ఫోర్స్ కమాండర్ బీరుట్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, ఇజ్రాయెల్ ఫైటర్ జెట్లు చేసిన దాడిలో ఇస్మాయిలీ చనిపోయాడని ఐఆర్‌జీసీ వర్గాలు వెల్లడించినట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం వెల్లడించింది.
ఇరాన్ చీఫ్ తో సంబంధాలు కట్
ఇస్మాయిలీతో సంబంధాలు కట్ కావడంతో ఐఆర్‌జీసీ దళంలో తీవ్ర ఆందోళన నెలకొంది. 2020లో అమెరికా దళాలు అప్పటి ఐఆర్‌జీసీ ఖుద్స్ ఫోర్స్ చీఫ్ ఖాసీం సులేమానీపై డ్రోన్ దాడి చేసి చంపింది. దీంతో.. ఆయన స్థానంలో ఇస్మాయిలీ బాధ్యతలు చేపట్టారు. నస్రల్లా మరణం తర్వాత టెహ్రాన్‌లోని హెజ్‌బొల్లా కార్యాలయానికి కూడా ఆయన వెళ్లారు. అంతేకాకుండా హెజ్‌బొల్లా నూతన చీఫ్‌గా భావిస్తున్న హషీమ్ సఫీద్దీన్‌తో ఇస్మాయిలీ భేటీ అయ్యారు. ఆ టైంలో ఇజ్రాయెల్ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా ఖమేనీకి రైట్‌హ్యాండ్‌గా ఇస్మాయిలీకి పేరుంది. గతవారం, ఏప్రిల్‌లో ఇజ్రాయెల్‌పై జరిగిన మిసైల్స్ దాడుల్లో ఐఆర్‌జీసీ చీఫ్ ప్రమేయం ఉంది. ఖమేనీ తరఫున హమాస్, హుతీలు, హెజ్‌బొల్లా, ఇరాక్‌లోని మిలిటెంట్ సంస్థలతో సంబంధాలు మెయింటెన్ చేసేది కూడా ఆయనే. అక్టోబర్ 1 నాటి క్షిపణి దాడులకు ఇజ్రాయెల్ ప్రతీకారంగానే ఇస్మాయిలీపై దాడి చేసినట్లు తెలుస్తోంది.