బ్రెజిల్‌లో తుపాను బీభత్సం:12 మంది మృతి
బ్రెజిల్‌లో తుపాను బీభత్సం సృష్టించింది. ఆగ్నేయ బ్రెజిల్‌లోని రియో డి జెనీరో, ఎస్సిరిటో శాంటో రాష్ట్రాల్లోని పర్వత ప్రాంతాల్లో శక్తివంతమైన తుపాను సంభవించింది.
దిశ, నేషనల్ బ్యూరో: బ్రెజిల్‌లో తుపాను బీభత్సం సృష్టించింది. ఆగ్నేయ బ్రెజిల్‌లోని రియో డి జెనీరో, ఎస్సిరిటో శాంటో రాష్ట్రాల్లోని పర్వత ప్రాంతాల్లో శక్తివంతమైన తుపాను సంభవించింది. దీంతో పలు ఘటనల్లో 12మంది మృతి చెందారు. అంతేగాక మరికొందరు అదృశ్యమైనట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు రెస్క్యూ బృందాలను మోహరించారు. మెట్రోపోలిస్ నగరంలో కురిసిన భారీ వర్షానికి పలు ఇళ్లు కూలిపోవడంతో అనేక మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు వందలాది మంది సైనికులు, అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే ఓ బాలిక మృత దేహాన్ని గుర్తించారు. ఇప్పటి వరకు 90మందిని రక్షించినట్టు తెలుస్తోంది,
బ్రెజిల్‌లో ప్రస్తుత పరిస్థితిపై అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా స్పందించారు. ‘వాతావరణ మార్పుల వల్ల పర్యావరణ విపత్తులు తీవ్రమవుతున్నాయి. బ్రెజిల్‌లో తుపాను కారణంగా వేలాది మంది ఇప్పటికే నిరాశ్రయులయ్యారు’ అని తెలిపారు. ‘ప్రస్తుత తుపాను కారణంగా భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. రెస్య్కూ చర్యలను అధికారులు పర్యవేక్షిస్తున్నారు’ అని పేర్కొన్నారు. బాధితులకు సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. రియో డి జెనీరోలో భారీ వర్షాలు కొనసాగుతాయని అధికారులు అంచనా వేశారు. కాగా, దక్షిణ అమెరికాలోని అతిపెద్ద దేశమైన బ్రెజిల్ ఇటీవలి విపరీతమైన విపత్తులను ఎదుర్కొంటుంది. వాతావరణ మార్పుల వల్లే ఈ ఘటనలు జరుగుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు.