Donald Trump: అమెరికన్లను చంపిన వలసదారులకు మరణశిక్ష విధిస్తా.. ప్రచార సభలో ట్రంప్ వ్యాఖ్యలు

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ అక్రమ వలసదారులపై రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు.

Update: 2024-10-12 07:02 GMT

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ అక్రమ వలసదారులపై రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. తమ దేశ పౌరులను చంపిన వలసదారులకు మరణశిక్ష విధించే బిల్లుని తెస్తానని హామీ ఇచ్చారు. కొలరాడోలోని ఆరోరాలో ఆయన ప్రచార సభలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మన దేశాన్ని ప్రమాదకరమైన నేరస్థులు ఆక్రమించుకున్నారు. ‘ అమెరికాను ప్రమాదకరమైన నేరస్థులు ఆక్రమించుకున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా మన దేశాన్ని ఆక్రమిత అమెరికా అని పిలుస్తున్నారు. నేను అధ్యక్షుడిగా ఎన్నికైతే వలసదారులే లక్ష్యంగా నేషనల్‌ ఆపరేషన్‌ అరోరాను ప్రారంభిస్తా. దీంతో నవంబరు 5న అమెరికా విముక్తి దినోత్సవంగా మారుతుంది. అమెరికన్లను, చట్టబద్ధంగా ఉన్న అధికారులను చంపిన వలసదారులకు మరణశిక్ష విధించే బిల్లును తెస్తాం. వెనెజువెలా గ్యాంగ్‌.. ట్రెన్‌ డె అరగువా సభ్యులు అనేక శిథిలావస్థలో ఉన్న అరోరా అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌లను నియంత్రిస్తున్నారు. వారిని ఏరివేసేందుకు అరోరాపై దృష్టిసారిస్తా. అరోరాను, దాడి చేసి స్వాధీనం చేసుకున్న ప్రతీ సిటీని నేను రక్షిస్తా. ఆ క్రూరులను జైలులో పెడతాం. వారిని దేశం నుంచి తరిమేస్తాం’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు

ఇక, అమెరికా ప్రభుత్వం దక్షిణ సరిహద్దుపై పట్టు కోసం మెక్సికోతో పలు సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈనేపథ్యంలో ఆ ప్రాంతంలో వలసదారుల చొరబాటు పెరిగిపోతుందని ట్రంప్ అంటున్నారు. అంతే కాకుండా, ట్రంప్‌ రక్షణకు మరిన్ని సైనిక వాహనాలు, సిబ్బందిని కోరుతూ ఆయన ప్రచార సిబ్బంది వైట్‌హౌస్‌ను అభ్యర్థించినట్లు తెలుస్తోంది. తగిన రక్షణ సిబ్బంది లేకపోవడంతో ట్రంప్‌ ప్రచార కార్యక్రమాలకు పలు అడ్డంకులు ఎదురవుతున్నాయని పేర్కొంది. ఇకపోతే, వచ్చే నెల అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్‌ ట్రంప్‌, డెమోక్రటిక్‌ అభ్యర్థిగా కమలాహారిస్‌లు బరిలో ఉన్నారు.


Similar News