TANA: విజయవంతంగా 'మన వారసత్వ సంపద' సాహిత్య సమావేశం..

జులై30న తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన “మన వారసత్వ సంపద” అనే సాహిత్య సమావేశం విజయవంతంగా ముగిసింది.

Update: 2023-08-04 14:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: జులై30న తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహించిన “మన వారసత్వ సంపద” అనే సాహిత్య సమావేశం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా తానా అధ్యక్షుడు నిరంజన్ శృంగవరపు మాట్లాడుతూ.. మన తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేసిన ఇంతమంది పండితుల వారసులను ఒకే వేదిక మీద సమకూర్చడం తానా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిందన్నారు.


ప్రతి నెలా క్రమం తప్పకుండా విభిన్న సాహిత్య అంశాల మీద అంతర్జాలంలో జరుపుకుంటున్న ఈ 57 వ సమావేశం ఎంతో విశిష్టమైనదని, కట్టడాలు, పట్టణాలు కూలిపోవచ్చు గాని వీరు సృష్టించిన సాహిత్యం అజరామరం అని తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయ కర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అన్నారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ.. “వెయ్యేళ్ళ తెలుగు సాహిత్య చరిత్రలో మన తెలుగు భాషా సాహిత్యాలను తమ కలాలతో, గళాలతో సుసంపన్నం చేసిన ఎంతోమంది కవుల, పండితుల తర తరాల వారసులు పాల్గొంటున్న ఇదొక అపూర్వ సమ్మేళనం అని తెలిపారు.


Similar News