India-Canada: భారత్ ను రష్యాతో పోలుస్తూ అక్కసు వెళ్లగక్కిన కెనడా

భారత్‌- కెనడా మధ్య దౌత్యవిబేధాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత దౌత్యవేత్తలపై విమర్శలు చేయడాన్ని మాత్రం కెనడా మర్చిపోవట్లేదు.

Update: 2024-10-19 07:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌- కెనడా మధ్య దౌత్యవిబేధాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత దౌత్యవేత్తలపై విమర్శలు చేయడాన్ని మాత్రం కెనడా మర్చిపోవట్లేదు. ఇకపోతే, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) మాటల్నే విదేశాంగమంత్రి మెలానీ జోలీ (Melanie Joly) కూడా ప్రస్తావించారు. కెనడాలో మిగిలిన దౌత్యవేత్తలపై నిఘా ఉంచామంటూ భారత్‌పై విమర్శల ప్రక్రియను కొనసాగించారు. అంతటితో ఆగకుండా భారత్‌ను రష్యాతో పోలుస్తూ అక్కసు వెళ్లగక్కారు. వియన్నా కన్వెన్షన్‌ ఒప్పంద ఉల్లంఘనకు పాల్పడితే సహించేది లేదని మెలానీ వ్యాఖ్యానించారు. మెలానీ జోలీ మాట్లాడుతూ.. “కెనడా దేశ చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదు. మన దేశ గడ్డపై విదేశీ అణచివేత జరగదు. ఐరోపాలో ఇలాంటి ఘటనలు చూశాం.. జర్మనీ , బ్రిటన్‌ విషయంలో రష్యా విదేశీ జోక్యానికి పాల్పడింది. మేం ఈ విషయంలో చాలా దృఢంగా ఉన్నాం” అని వెల్లడించారు.

నిజ్జర్ హత్య కేసు వివాదం

కాగా, ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషనర్‌ సంజయ్‌ కుమార్‌ వర్మ పేరును కెనడా సర్కార్ చేర్చింది. అతడ్ని విచారించాల్సి ఉందని భారత విదేశాంగ శాఖకు కెనడా సందేశం చేసింది. ఇక, దీనిపై భారత్‌ తీవ్రంగా మండిపడింది. నిరసనగా ఆరుగురు కెనడా దౌత్యవేత్తలను బహిష్కరించింది.


Similar News