Gaza War : గాజాలో యుద్ధం ఇక ఆపేయండి.. ఇజ్రాయెల్ ప్రధానికి అమెరికా అధ్యక్షుడి సూచన

దిశ, నేషనల్ బ్యూరో : హమాస్ నేత యహ్యా సిన్వార్ అంతమైనందున ఇక గాజాలో యుద్ధం ఆపాల్సిన సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.

Update: 2024-10-18 18:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో : హమాస్ నేత యహ్యా సిన్వార్ అంతమైనందున ఇక గాజాలో యుద్ధం ఆపాల్సిన సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. ఈ సమయంలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపేసి.. హమాస్ చెరలో ఉన్న ఇజ్రాయెలీ బందీలను విడిపించుకోవడంపై ఫోకస్ పెట్టడం మంచిదని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూతో ఫోన్ కాల్‌లో మాట్లాడిన బైడెన్.. ఈ అంశంపై ప్రధానంగా చర్చించినట్లు తెలిసింది. త్వరలోనే తాను ఇజ్రాయెల్‌లో పర్యటించి.. బందీల విడుదల, కాల్పుల విరమణ కోసం హమాస్‌తో చర్చలు జరపాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తానని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ప్రకటించారు. దీనిపై ఇజ్రాయెలీ ప్రధానమంత్రి కార్యాలయం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఇజ్రాయెలీ బందీలను హమాస్ చెర నుంచి విడుదల చేయించడంపై ఇక ఫోకస్ చేయనున్నాం. ఈవిషయంపై మేం అమెరికాతో కలిసి పనిచేస్తాం’’ అని వెల్లడించింది.

101 మంది ఇంకా హమాస్ చెరలోనే..

హమాస్ నేత యహ్యా సిన్వార్ మరణ వార్తను ధ్రువీకరించుకున్న అనంతరం ఇజ్రాయెల్ ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ ప్రసంగించారు. ‘‘సిన్వార్ మరణంతో గాజాలో యుద్ధం ఆగినట్టు కాదు. యుద్ధం చివరి అంకానికి ఇది ఆరంభం మాత్రమే. గాజా ప్రజలకు నేను చెప్పేది ఒక్కటే. ఈ యుద్ధం రేపే ఆగిపోగలదు. హమాస్ ఆయుధాలను వదిలేసి, ఇజ్రాయెలీ బందీలను విడిచిపెడితే యుద్ధం ఆగుతుంది’’ అని ఆయన స్పష్టం చేశారు. 23 దేశాలకు చెందిన 101 మంది ఇంకా హమాస్ చెరలోనే బందీలుగా ఉన్నారని నెతన్యాహూ గుర్తు చేశారు. ఇజ్రాయెలీ బందీలకు హమాస్ ఏదైనా చేటు చేస్తే.. అందుకు కారకులయ్యే ప్రతి ఒక్కరికీ తగిన శాస్తి చేస్తామని ప్రకటించారు. ఇరాన్ నిర్మించిన ఉగ్రవాద సౌధం కూలిపోతుండటాన్ని యావత్ ప్రపంచం ఇప్పుడు కళ్లారా చూస్తోందని ఇజ్రాయెల్ ప్రధాని పేర్కొన్నారు. నస్రల్లా, మొహసిన్, హనియా, దయీఫ్, సిన్వార్‌లను ఇజ్రాయెలీ దళాలు మట్టికరిపించిన విషయాన్ని గుర్తుచేశారు.

హౌతీలకు దన్ను.. ఇద్దరు భారతీయులపై అమెరికా ఆంక్షలు

యెమన్‌లోని హౌతీ మిలిటెంట్లకు ఇరాన్ నుంచి చమురును సప్లై చేస్తున్న సయీద్ అల్ జమాల్ నెట్‌వర్క్‌‌తో సంబంధమున్న ఇద్దరు భారతీయులపై అమెరికా ఆంక్షలు విధించింది. రాహుల్ రతన్ లాల్ వరికూ, దీపాంకర్ మోహన్ కియోత్‌లపై అమెరికాకు చెందిన విదేశీ ఆస్తుల నియంత్రణ విభాగం ఆంక్షలను విధిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. హౌతీలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్న 18 కంపెనీలపైనా ఆంక్షలను విధించామని వెల్లడించింది. ఇండో గల్ఫ్ షిప్ మేనేజ్‌మెంట్ కంపెనీ కోసం యూఏఈ నుంచి రాహుల్ రతన్‌ లాల్ వరికూ.. హాంకాంగ్ నుంచి దీపాంకర్ మోహన్ కియోత్‌లు పనిచేశారని దర్యాప్తులో గుర్తించారు. ఈ ఆంక్షల్లో భాగంగా రాహుల్ రతన్, దీపాంకర్ మోహన్‌తో పాటు సదరు 18 కంపెనీలు కలిగి ఉన్న ఆస్తుల్లో సగభాగాన్ని సీజ్ చేసి అమెరికా విదేశీ ఆస్తుల నియంత్రణ విభాగానికి అప్పగించనున్నారు.


Similar News