Tharman Shanmugaratnam: సింగపూర్ అధ్యక్ష బరిలో భారత సంతతి వ్యక్తి..

సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో 85 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది.

Update: 2023-09-01 12:50 GMT

సింగపూర్: సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో 85 శాతానికిపైగా పోలింగ్ నమోదైంది. దేశంలోని 1,264 పోలింగ్ స్టేషన్‌లలో దాదాపు 23 లక్షల మందికిపైగా సింగపూర్ వాసులు శుక్రవారం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన ముగ్గురు అభ్యర్ధుల్లో భారత సంతతికి చెందిన మాజీ మంత్రి ధర్మాన్ షణ్ముగ రత్నం (66) కూడా ఉన్నారు. తనకు సింగపూర్ వాసులు అండగా నిలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. సింగపూర్‌లో జన్మించిన భారత సంతతికి చెందిన ధర్మాన్ షణ్ముగరత్నం 2001లో రాజకీయాల్లోకి వచ్చారు.

రెండు దశాబ్దాలకు పైగా అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) నుంచి వివిధ మంత్రి పదవుల్లో పనిచేశారు. 2011-2019 మధ్య సింగపూర్ ఉప ప్రధానమంత్రిగా సేవలు అందించారు. ఆ దేశ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకుగానూ ఈ ఏడాది జూలైలో ప్రజా, రాజకీయ పదవులకు ధర్మాన్ రాజీనామా చేశారు. సింగపూర్‌కు గతంలో ఇద్దరు భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు అధ్యక్షులుగా సేవలందించారు. తమిళ సంతతికి చెందిన సెల్లపన్ రామనాథన్ 2009లో సింగపూర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కేరళ సంతతికి చెందిన దేవన్ నాయర్ 1981 నుంచి 1985 వరకు సింగపూర్ మూడో అధ్యక్షుడిగా పనిచేశారు.


Similar News