Hunger index: గ్లోబల్ హంగర్ ఇండెక్స్..105వ స్థానంలో భారత్
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జీహెచ్ఐ) 2024 నివేదికలో 127 దేశాలకు గాను భారత్ 105వ స్థానంలో నిలిచింది.
దిశ, నేషనల్ బ్యూరో: గ్లోబల్ హంగర్ ఇండెక్స్ (జీహెచ్ఐ) 2024 నివేదికలో 127 దేశాలకు గాను భారత్ 105వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో భారత్ పొరుగు దేశాలైన శ్రీలంక 56, నేపాల్ 68, బంగ్లాదేశ్ 84వ స్థానంలో ఉన్నాయి. అంటే ఈ దేశాల్లో ఆకలి పరిస్థితి భారత్ కంటే మెరుగ్గా ఉంది. ఇక, పాకిస్థాన్ 109వ స్థానంలో ఇండియా కన్నా కాస్త వెనుకబడి ఉండటం గమనార్హం. చైనా, యూఏఈ, కువైట్‌లతో సహా 22 దేశాలు మొదటి స్థానంలో ఉన్నాయి. ‘కన్సర్న్ వరల్డ్‌వైడ్’, ‘వెల్తుంగర్‌హిల్ఫ్’ సంయుక్తంగా ఈ నివేదికను రూపొందించాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భారత్ ర్యాంక్ కాస్త మెరుగుపడింది. 2023లో 125 దేశాల్లో భారత్ 111వ స్థానంలో ఉండగా, 2022లో 121 దేశాల్లో 107వ స్థానంలో నిలిచింది.
2024 నివేదికలో భారత్ జీహెచ్ఐ స్కోర్ 27.3గా ఉంది. అంటే ఇది తీవ్రమైన ఆకలిని సూచిస్తుంది. ఇది 2016లో 29.3గా ఉండగా.. కాస్త మెరుగుపడింది. అయినప్పటికీ తీవ్రమైన కేటగిరీ కిందకే వస్తుంది. ఇక, భారత్ లోని పిల్లలు పోషకాహార లోపంలో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. 2000 నుండి శిశు మరణాల రేటును గణనీయంగా మెరుగుపరుచుకున్నప్పటికీ, పిల్లల పోషకాహారలోపం అనేది ఒక క్లిష్టమైన సమస్యగా మిగిలిపోయింది. భారతదేశ జనాభాలో 13.7శాతం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. దీని కారణంగా 2.9 శాతం మంది పిల్లలు 5 ఏళ్లలోపు వారు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. 127 దేశాల్లో 42 దేశాల్లో పరిస్థితి తీవ్ర ఆందోళన కరంగా ఉందని నివేదిక తెలిపింది.
కాగా, ఏ దేశంలో ఆకలి పరిస్థితి ఎలా ఉందో జీహెచ్ఐ అధ్యయనం చేస్తుంది. ఈ జాబితాను కన్సర్న్ వరల్డ్‌వైడ్, వరల్డ్ హంగర్ హెల్ప్ అనే ఎన్జీఓలు ప్రతి ఏటా తయారు చేస్తారు. పోషకాహార లోపం, పిల్లల మరణాలు తదితర విషయాలను పరిగణనలోకి తీసుకుని ఈ నివేదికను రూపొందిస్తారు. 50 లేదా అంతకంటే ఎక్కువ జీహెచ్ఐ స్కోర్ ఉన్న దేశాలు చాలా ఆందోళనకరమైనవిగా చెబుతారు.