కుక్క మాంసం నిషేధం పై ఉద్రిక్తత.. ప్రభుత్వం రైతుల మధ్య వాగ్వాదం..
దక్షిణ కొరియా ప్రభుత్వం 2027 సంవత్సరం నుండి కుక్క మాంసం పరిశ్రమను నిషేధించాలని నిర్ణయించుకుంది.
దిశ, వెబ్‌డెస్క్ : దక్షిణ కొరియా ప్రభుత్వం 2027 సంవత్సరం నుండి కుక్క మాంసం పరిశ్రమను నిషేధించాలని నిర్ణయించుకుంది. పరిశ్రమ పై నిషేధానికి ముందు రైతులకు, ఇతర ప్రజలకు నష్టపరిహారం ప్రకటించింది. ప్రభుత్వం పెట్టిన ఈ పథకం పై రైతులు, జంతు హక్కుల కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి దక్షిణ కొరియా పార్లమెంట్ ఈ ఏడాది జనవరిలో ఒక చారిత్రాత్మక బిల్లును ఆమోదించింది. దీని ప్రకారం కుక్కలను వధించడం, పెంపకం లేదా బహిరంగ వినియోగం కోసం విక్రయించడం మూడు సంవత్సరాల తర్వాత నిషేధించింది. ప్రభుత్వం చేసిన ఈ చట్టం 2027 నుంచి అమలులోకి రానుంది. దీనిని ఉల్లంఘిస్తే 2 నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించనున్నారని తెలిపింది.
ప్రభుత్వం రైతులకు ఎంత పరిహారం ఇస్తుంది ?
ప్రభుత్వం పెట్టిన ఈ బిల్లు కారణంగా రైతులు తమ వ్యాపారాన్ని ముందుగానే మూసివేసేందుకు అంగీకరిస్తే వారు ఒక కుక్కకు సుమారు రూ.14 వేల నుంచి దాదాపు రూ.37 వేల 500 వరకు పరిహారం పొందుతారని దక్షిణ కొరియా వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది.
అయితే రైతులు ఒక్కో కుక్కకు సుమారు రూ.1.25 లక్షలు డిమాండ్ చేస్తున్నందున ప్రభుత్వం ఈ ప్రతిపాదనను రైతులు అంగీకరించరని భావిస్తున్నారు. ఈ నిషేధం తమ స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని, తమ ఆర్థిక సమస్యలు పెరుగుతాయని రైతులు అంటున్నారు.
కుక్క మాంసం వ్యాపారంతో సంబంధం ఉన్న రైతుల సంఘం ఒక ప్రకటన విడుదల చేసింది. చట్టాన్ని సవరించడం ద్వారా గ్రేస్ పీరియడ్‌ను పొడిగించాలని, రైతులకు సరైన నష్టపరిహారం ప్రణాళికను కూడా రూపొందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
ప్రభుత్వ పరిహారం పథకం పై ప్రశ్నలు..
జంతు హింసకు వ్యతిరేకంగా పనిచేస్తున్న హ్యూమన్ సొసైటీ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రచార నిర్వాహకుడు సంగ్యుంగ్ లీ మాట్లాడుతూ ఈ చారిత్రక చట్టానికి ప్రభుత్వం చేసిన ఈ ప్రకటన ఒక మైలురాయిగా నిరూపిస్తుందన్నారు. దీంతో నిషేధం పూర్తిగా అమలులోకి వస్తుందని, దేశంలో కుక్క మాంసం శకానికి తెరపడుతుందన్నారు.
పెద్ద ఎత్తున కుక్కల పెంపకం..
కొరియా ద్వీపకల్పంలో కుక్క మాంసం తినే సంప్రదాయం శతాబ్దాల నాటిది. చైనా, వియత్నాం, ఇండోనేషియా, కొన్ని ఆఫ్రికన్ దేశాల్లో కూడా కుక్క మాంసం తింటారు. కానీ దక్షిణ కొరియా సాంస్కృతిక, ఆర్థిక సూపర్ పవర్‌గా ఖ్యాతి పొందడం వల్ల ఆ దేశ కుక్క మాంసం పరిశ్రమ దృష్టిని ఆకర్షించింది. అలాగే పారిశ్రామిక స్థాయిలో కుక్కలను పెంచే ఏకైక దేశం ఇదే.
దక్షిణ కొరియా కుక్క మాంసం వ్యతిరేక ప్రచారానికి ఆ దేశ ప్రథమ మహిళ కిమ్ క్యోన్ హీ పదేపదే తన మద్దతును తెలియజేశారు. ఆమె ప్రదర్శనలు, ఉద్యమాల సమయంలో రైతులను లక్ష్యంగా చేసుకుంది. దీంతో రైతులు ఆమెపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు.
రైతుల కోసం ప్రభుత్వ పథకం..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా దాదాపు 4 లక్షల 66 వేల కుక్కలను ఆహారం కోసం పెంచుతున్నట్లు ఒక అధ్యయనంలో తేలిందని వ్యవసాయ డిప్యూటీ మంత్రి పార్క్ బోసు విలేకరులతో అన్నారు. నిషేధానికి ముందు తమ సొంత కుక్కల పెంపకాన్ని నిలిపివేసేందుకు ప్రభుత్వం రైతులను ఒప్పించే ప్రయత్నం చేస్తుందన్నారు. నిషేధం అమలులోకి వచ్చిన తర్వాత వదిలేసిన కుక్కలను దత్తత ఇవ్వాలని లేదా వాటిని చంపే బదులు వాటిని సంరక్షణ కేంద్రాల్లో ఉంచాలని ప్రభుత్వం యోచిస్తోందని ఆయన చెప్పారు.
కసాయిదారులకు కూడా పరిహారం చెల్లిస్తామని, కుక్కల పెంపకం, కబేళాలను ధ్వంసం చేసే బాధ్యత స్థానిక అధికారులదేనని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. మంత్రిత్వ శాఖ ప్రకారం, ఈ వ్యాపారంతో సంబంధం ఉన్న రైతులకు తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు ఇవ్వబడతాయని తెలిపింది. తద్వారా వారు మరొక వ్యవసాయ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.