Super typhoon Yagi : దడపుట్టిస్తున్న ‘యాగి’.. వియత్నాం, చైనా అతలాకుతలం

దిశ, నేషనల్ బ్యూరో : చైనా హవాయిగా పేరొందిన హైనాన్ ద్వీపంలో శుక్రవారం విధ్వంసం సృష్టించిన శక్తివంతమైన తుఫాను ‘యాగి’.. శనివారం ఉదయం ఉత్తర వియత్నాం తీరాన్ని తాకింది.

Update: 2024-09-07 12:06 GMT

దిశ, నేషనల్ బ్యూరో : చైనా హవాయిగా పేరొందిన హైనాన్ ద్వీపంలో శుక్రవారం విధ్వంసం సృష్టించిన శక్తివంతమైన తుఫాను ‘యాగి’.. శనివారం ఉదయం ఉత్తర వియత్నాం తీరాన్ని తాకింది. దీంతో ఆ ప్రాంతంలో గంటకు 203 కి.మీ వేగంతో భీకర ఈదురు గాలులు వీచాయి. ఈ తుఫాను ప్రభావం ప్రధానంగా వియత్నాం ఉత్తర భాగంలోని హైఫాంగ్, క్వాంగ్ నిన్ ప్రావిన్సులపై పడింది. ఇండో-పసిఫిక్ ట్రాపికల్ సైక్లోన్ వార్నింగ్ సెంటర్ ఈ వివరాలను వెల్లడించింది. హైఫాంగ్ ప్రావిన్స్‌లో ఈదురుగాలులకు చెట్టు కూలడంతో ఒకరు మృతిచెందారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ స్తంభించింది. ఈ ప్రావిన్స్ పరిధిలోని నాలుగు విమానాశ్రయాల నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. వియత్నాంలోని తీర ప్రాంతాల నుంచి దాదాపు 50వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. యాగి తుఫాను ప్రభావం తగ్గే వరకు ఇంట్లో నుంచి బయటికి రావొద్దని ప్రజలకు సూచనలు జారీ చేశారు. వియత్నాం రాజధాని హనోయితో పాటు దేశ ఉత్తర భాగంలోని 12 ప్రావిన్సులలో స్కూళ్లను మూసివేశారు.

అంతకుముందు చైనాలో ఇలా..

అంతకుముందు శుక్రవారం రాత్రి వరకు యాగి తుఫానుతో చైనా ప్రభావితమైంది. చైనాలోని హైనాన్ ద్వీపంపై దీని ఎఫెక్టు ఎక్కువగా పడింది. తుఫాను వల్ల చోటుచేసుకున్న వివిధ ఘటనల్లో ముగ్గురు చనిపోగా, 100 మంది గాయపడ్డారు. ఈ ద్వీపంలోని దాదాపు 4 లక్షల మందిని ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రైళ్లు, పడవలు, విమాన సర్వీసులను తాత్కాలికంగా ఆపేశారు. పాఠశాలలను మూసివేశారు. యాగి తుఫాను ప్రభావంతో హైనాన్ ద్వీపంలో విద్యుత్ సరఫరా వ్యవస్థ స్తంభించి దాదాపు 8.30 లక్షల ఇళ్లు అంధకారంలోకి జారుకున్నాయని తెలిసింది. తుఫాను ప్రభావంతో సంభవించిన వరదల వల్ల వేలాది హెక్టార్లలో పంటలు తుడిచిపెట్టుకుపోయాయని సమాచారం. ఈసంవత్సరంలో ఇప్పటివరకు సంభవించిన తుఫానులలో రెండో అత్యంత బలమైన తుఫాను ‘యాగి’ అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. యాగి ఒక సూపర్ తైఫూన్ అని.. సూపర్ తైఫూన్ అనేది కేటగిరి-5కి చెందిన హరికేన్‌తో సమానమైందని అంటున్నారు. యాగి తుఫాను ఈ వారం ప్రారంభంలో తొలుత ఫిలిప్పీన్స్‌ ఉత్తర తీరాన్ని తాకింది. అప్పటి నుంచి అది క్రమంగా బలపడుతూ చైనా, వియత్నాం తీరాలకు విస్తరించింది. దీని ప్రభావంతో ఉత్తర ఫిలిప్పీన్స్‌లోనూ 13 మంది చనిపోయారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.


Similar News