Papua New Guinea: పపువా న్యూగినియాలో హింస.. 30 మంది మృతి

పపువా న్యూగినియాలోని ఎంగా ప్రావీన్సులో భారీగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి.

Update: 2024-09-16 10:58 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పపువా న్యూగినియాలోని ఎంగా ప్రావీన్సులో భారీగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. రెండు గిరిజన వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో 30 మంది మరణించగా అనేక మంది గాయపడ్డట్టు అధికారులు తెలిపారు. అక్రమ మైనింగ్‌కు సంబంధించి వివాదం తలెత్తడంతో ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగినట్టు భావిస్తున్నారు. పపువా న్యూ గినియాలోని అతిపెద్ద బంగారు నిక్షేపాలలో ఒకటైన పోర్గెరా గని సమీపంలో నివసిస్తున్న రెండు తెగల మధ్య ఈ వివాదం జరిగింది. గత నాలుగు రోజులుగా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయని, అయితే ఆదివారం ఒక్కరోజే 300 సార్లు ఇరు వర్గాల మధ్య కాల్పులు జరిగాయి.

ఈ క్రమంలోనే 30 మంది ప్రాణాలు కోల్పోయారు. గని ప్రదేశానికి దగ్గరగా నివసిస్తున్న వారు మరొక సమూహంపై దాడి చేయడంతో హింస పెరిగిందని తెలిపారు. ఈ ఘటనల అనంతరం వందలాది మంది తమ ఇళ్లను వదిలి వెళ్లారు. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం గని సమీపంలో 122 మంది భద్రతా సిబ్బందిని మోహరించింది. హింసను అణిచివేసేందుకు భద్రతా దళాలకు అత్యవసర అధికారాలు కట్టబెట్టింది. కాగా, పోర్గెరా గని సమీపంలో 2022లో జరిగిన కాల్పుల్లోనూ 17 మంది మరణించారు. 


Similar News