Elon Musk: వివాదాస్పద ట్వీట్‌ను తొలగించిన ఎలన్ మస్క్
డెమోక్రాట్ నేతలపై ఇలాంటివి జరగడంలేదంటూ సందేహం వ్యక్తం చేశారు.
దిశ, నేషనల్ బ్యూరో: టెక్ బిలియనీర్ ఎలన్ మస్క్ అమెరికా అధ్యక్షులకు సంబంధించిన ట్వీట్ డిలీట్ చేయడం అతిపెద్ద చర్చకు దారితీసింది. ఇటీవల అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పుల యత్నం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన ఎలన్ మస్క్ డెమోక్రాట్ నేతలపై ఇలాంటివి జరగడంలేదంటూ సందేహం వ్యక్తం చేశారు. ట్రంప్‌ను మాత్రమే ఎందుకు చంపాలనుకుంటున్నారని ట్విటర్‌లో ఓ యూజర్ పోస్ట్‌పై స్పందించిన ఎలన్ మస్క్.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్‌లను హత్య చేయడానికి ఎందుకని ప్రయత్నాలు జరగడంలేదు అని ఎలన్ మస్క్ ట్వీట్ చేశారు. అయితే, ఆ పోస్ట్ కాస్త వివాదాస్పదం కావడంతో తొలగించారు. తన వివాదాస్పద పోస్ట్‌ను తొలగించిన తర్వాత విమర్శలకు బదులిస్తూ.. ఒక గ్రూప్ సరదాగా నవ్వుకునేందుకు మాట్లాడినవి, అందరికీ వర్తిస్తుందని కాదని పేర్కొన్నారు. తాజాగా ఫ్లొరిడాలోని ఓ గోల్ఫ్ కోర్టులో డొనాల్డ్ ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి సమీపంలో తుపాకీతో కనబడటంతో సీక్రెట్ ఏజెంట్లు కాల్పులు జరిపారు. ఈ ఘటన నుంచి ట్రంప్ సురక్షితంగా బయటపడినట్టు అధికారులు వెల్లడించారు. దీనిపై ఎఫ్‌బీఐ అనుమానితుడిని అరెస్ట్ చేసినట్టు ధృవీకరించింది.