Taliban: ఆప్ఘనిస్థాన్‌లో పోలియో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిలిపివేత.. తాలిబన్ల సంచలన నిర్ణయం
ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరిపై అనేక రకాల ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే.
దిశ, నేషనల్ బ్యూరో: ఆప్ఘనిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మహిళలు, పిల్లలు, పురుషులు సహా ప్రతి ఒక్కరిపై అనేక రకాల ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆప్ఘనిస్థాన్‌లో ఈ నెలలో ప్రారంభించాల్సిన పోలియో వ్యాక్సినేషన్ ప్రచారాన్ని వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి సోమవారం వెల్లడించింది. ఈ కార్యక్రమాన్ని ఆపడానికి గల కారణాలను తాలిబన్లు వెల్లడించలేదు. అయితే ఇంటింటికీ వ్యాక్సినేషన్ వేసే బదులుగా మసీదు వంటి ప్రాంతాల్లో టీకాలు వేయాలనే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్య్లూహెచ్ఓ) సీనియర్ అధికారి తెలిపారు.
మరోవైపు ప్రపంచ పోలియో నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఆప్ఘనిస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇంటింటికీ వ్యాక్సినేషన్ వేయడం కంటే సైట్ టూ సైట్ టీకాలు వేయడంపై చర్చలు జరుగుతున్నాయని డబ్లూహెచ్ఓ డాక్టర్ హమీద్ జాఫారీ తెలిపారు. మార్పులు చేర్పులపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. కాగా, అత్యధికంగా పోలియో వ్యాప్తి చెందుతున్న దేశాల్లో ఆఫ్ఘనిస్థాన్ మొదటి స్థానంలో ఉండగా.. పాకిస్తాన్ ఆ తర్వాత ప్లేసులో ఉంది. ఈ ఏడాది ఆఫ్ఘనిస్తాన్‌లో 18 పోలియో కేసులను డబ్లూహెచ్ లో ధ్రువీకరించింది. 2023లో 6 కేసులు మాత్రమే వెలుగు చూడగా ప్రస్తుత ఏడాది వాటి సంఖ్య గణనీయంగా పెరగడం గమనార్హం.