India-Canada: మోడీ, జైశంకర్ పై ఆరోపణలు.. భారత్ ఆగ్రహంతో వెనక్కి తగ్గిన కెనడా
ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య(Nijjar Murder Case) కేసుపై భారత్ పై కెనడా తీవ్ర ఆరోపణలు చేసింది. అందులో భారత ప్రధాని నరేంద్రమోడీ (PM Modi) పేరును ప్రస్తావించింది.
దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య(Nijjar Murder Case) కేసుపై భారత్ పై కెనడా తీవ్ర ఆరోపణలు చేసింది. అందులో భారత ప్రధాని నరేంద్రమోడీ (PM Modi) పేరును ప్రస్తావించింది. దీనిపై, భారత్ ఆగ్రహం చెందడంతో కెనడా (Canada) వెనక్కి తగ్గింది. ఆ స్టోరీలన్నీ అవాస్తమని తెలిపుతూ ఒట్టవా ప్రకటన విడుదల చేసింది. ‘‘ప్రజల భద్రతకు ముప్పు పొంచి ఉన్న వేళ అక్టోబరు 14న రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు, అధికారులు తీవ్ర చర్య చేపట్టారు. భారత ప్రభుత్వానికి చెందిన ఏజెంట్లు పాల్పడుతున్న నేర కార్యకలాపాలకు సంబంధించి కెనడా అధికారులు బహిరంగ ప్రకటనలు చేశారు. వీటిలో భారత ప్రధాని మోడీ (Narendra Modi), భారత విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్‌తో సంబంధం ఉన్నట్లు కెనడా ప్రభుత్వం ఎప్పుడూ చెప్పలేదు. దీని సాక్ష్యాధారాల గురించి కూడా తెలియదు. దీనికి భిన్నంగా ఎలాంటి స్టోరీలు వచ్చినా అవన్నీ ఊహాజనితమైనవి. అవాస్తమైనవే’’ అని కెనడా సర్కారు తమ ప్రకటనలో వెల్లడించింది.
అసలేం జరిగిందంటే?
కెనడా (Canada)కు చెందిన ‘ది గ్లోబ్ అండ్ మెయిల్’ వార్తాపత్రికలో ఇటీవల నిజ్జర్ హత్య (Nijjar Murder Case) గురించి మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ హత్యకు కుట్రలో భారత (India) జాతీయ భద్రతా సలహాదారు, విదేశాంగ శాఖ మంత్రిత్వశాఖ కూడా భాగమైనట్లు తమకు తెలిసిందని కెనడా సీనియర్ జాతీయ భద్రతా అధికారి ఒకరు చెప్పినట్లు పేర్కొంది. అంతేకాదు.. ప్రధాని మోడీ పేరుని కూడా ప్రస్తావిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. దీనిపై భారత్ మండిపడింది. అవన్నీ హాస్యాస్పద వార్తలని ఖండించింది. ఇప్పటికే ఇరుదేశాల సంబంధాలు దెబ్బతిన్నాయని.. ఇలాంటి దుష్ప్రచారాలతో అవి మరింత బలహీనపడతాయని భారత్ హెచ్చరించింది. ఇలాంటి టైంలో కెనడా ఈ ప్రకటన చేయడం గమనార్హం.