పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి: ఐదుగురు చైనా పౌరుల మృతి
పాకిస్థాన్‌లో వరుస ఉగ్రదాడి ఘటనలు కలకలం రేపుతున్నాయి. దేశంలోనే రెండో అతిపెద్ద నేవీ ఎయిర్ స్టేషన్ పై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన దాడి ఘటన మరువకముందే మరో ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో వరుస ఉగ్రదాడి ఘటనలు కలకలం రేపుతున్నాయి. దేశంలోనే రెండో అతిపెద్ద నేవీ ఎయిర్ స్టేషన్ పై బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ చేసిన దాడి ఘటన మరువకముందే మరో ఆత్మాహుతి దాడి చోటు చేసుకుంది. వాయువ్య పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫంఖ్తుంఖ్వాలో జరిగిన ఈ ఘటనలో ఐదుగురు చైనా పౌరులు మరణించినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. చైనా ఇంజనీర్ల కాన్వాయ్ ఇస్లామాబాద్ నుంచి ఖైబర్ ఫంఖ్తుంఖ్వా ప్రావీన్సు దాసులోని తమ క్యాంపునకు వెళ్తుండగా..వారి వాహనాన్ని ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో కూడిన మరో వాహనంతో ఢీకొట్టినట్టు పోలీసు ఉన్నతాధికారి మహ్మద్ అలీ గండాపూర్ తెలిపారు. ఈ ఘటనలో ఐదుగురు చైనా పౌరులు, పాకిస్థాన్ కు చెందిన ఓ డ్రైవర్ మరణించినట్టు వెల్లడించారు. విషయం తెలుసుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కాన్వాయ్‌లోని మిగిలిన వారికి భద్రత కల్పించారు. అయితే ఈ దాడికి ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహించలేదు. పేలుడు ధాటికి బస్సు లోయలో పడింది. కాగా, ఇదే ప్రాంతంలో 2021లోనూ ఓ బస్సులో జరిగిన పేలుడులో తొమ్మిది మంది చైనా పౌరులు సహా 13 మంది మరణించారు.