18 మంది మత్స్య కారులను అరెస్టు చేసిన శ్రీలంక
ఈశాన్య ప్రాంతంలోని మన్నార్ తీరంలో అదుపులోకి తీసుకుని వారి ట్రాలర్లను స్వాధీనం చేసుకున్నట్టు శ్రీలంక నేవీ తెలిపింది.
దిశ, నేషనల్ బ్యూరో: శ్రీలంక నేవీ18 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసింది. ఈశాన్య ప్రాంతంలోని మన్నార్ తీరంలో అదుపులోకి తీసుకుని వారి ట్రాలర్లను స్వాధీనం చేసుకున్నట్టు శ్రీలంక నేవీ ఓ ప్రకటనలో తెలిపింది. మత్స్యకారులను మన్నార్‌కు తరలించి తదుపరి చర్యల నిమిత్తం తలైమన్నార్ ఫిషరీస్ ఇన్‌స్పెక్టర్‌కు అప్పగిస్తామని పేర్కొంది. ఈ నెలలోనే భారత మత్య్సకారులను అరెస్టు చేయడం ఇది మూడోసారి. అంతకు ముందు ఆదివారం 10 మంది, శనివారం 12 మంది భారతీయ మత్స్యకారులు పట్టుబడ్డారని వెల్లడించింది. కాగా, భారత్, శ్రీలంక మధ్య సంబంధాల్లో మత్స్యకారుల సమస్య ఎప్పటి నుంచో వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ దాటి శ్రీలంక సముద్ర జలాల్లో చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణలపై భారత మత్స్యకారులను శ్రీలంక అధికారులు అరెస్టు చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. అధికారిక లెక్కల ప్రకారం.. 2023లో మొత్తం 240 మంది భారతీయ మత్స్యకారులను అరెస్టు చేసి, వారికి సంబంధించిన 35 ట్రాలర్లను శ్రీలంక స్వాధీనం చేసుకుంది.