Southern Gaza: దక్షిణ గాజాపై ఇజ్రాయెల్ దాడి..15 మంది మృతి
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. దక్షిణ గాజాపై మంగళవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది.
దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. దక్షిణ గాజాపై మంగళవారం తెల్లవారుజామున ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఈ ఘటనల్లో 15 మంది మరణించినట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మృతుల్లో ఆరుగురు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నట్టు వెల్లడించారు. అంతేగాక బెని సుహైలాలోని ఒక ఇంటిపై దాడి జరిగిందని, ఇందులో ఒకే కుటుంబానికి చెందిన సుమారు 10 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. ఈ దాడులపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) స్పందించింది. పౌరులకు హాని కలిగించకుండా ప్రయత్నాలు చేస్తున్నామని.. కానీ హమాస్ మిలిటెంట్లు పౌర ప్రాంతాల్లోనే ఆశ్రయం పొందుతున్నారని తెలిపింది. అయితే శరణార్థి శిబిరాలపైనే ఐడీఎఫ్ దాడులు చేయడం గమనార్హం.
లెబనాన్‌లోని క్రైస్తవ స్థావరాలపై దాడి: 21 మంది మృతి
ఉత్తర లెబనాన్‌లో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో 21 మంది మరణించగా.. మరో 8 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ట్రిపోలీలోని క్రైస్తవ ప్రాంతమైన ఐటౌలో అటాక్ జరిగినట్టు తెలిపింది. హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఇజ్రాయెల్, హిజ్బుల్లా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్ని అనంతరం ఈ ప్రాంతంపై దాడి జరగడం ఇదే మొదటిసారి. అయితే ఈ దాడులపై ఇజ్రాయెల్ సైన్యం స్పందించలేదు. ఈ దాడిలో ఇజ్రాయెల్ ఎవరిని టార్గెట్ చేసిందో కూడా స్పష్టంగా తెలియలేదు.