Middle East Crises: లెబనాన్, ఇజ్రాయెల్ సరిహద్దుల్లో ప్రయాణాలు నిషేధించిన దక్షిణ కొరియా

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో దక్షిణ కొరియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది

Update: 2024-08-06 11:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో దక్షిణ కొరియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశ పౌరులు ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దు ప్రాంతాలకు ప్రయాణించవద్దని, ఒకవేళ నిబంధనలు అతిక్రమించి అక్కడికి వెళ్లిన వారిపై నిషేధం విధిస్తామని దక్షిణ కొరియా పేర్కొంది. సరిహద్దుల సమీపంలోని ప్రాంతాల్లో బుధవారం నుండి నిషేధం ప్రారంభమవుతుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. లెబనాన్, ఇజ్రాయెల్‌లో ఉన్నటువంటి తమ జాతీయులు వీలైనంత త్వరగా ఆయా దేశాలను విడిచిపెట్టాలని మంత్రిత్వ శాఖ గట్టిగా హెచ్చరిక జారీ చేసింది.

500 మందికి పైగా దక్షిణ కొరియా పౌరులు ప్రస్తుతం ఇజ్రాయెల్‌లో, 120 మంది లెబనాన్‌లో నివసిస్తున్నారని మంత్రిత్వ శాఖ తెలిపింది. సరిహద్దు ప్రాంతాలకు వెళ్లే దక్షిణ కొరియన్లు ప్రభుత్వం జారీ చేసిన కొత్త నిబంధనలను అతిక్రమించినట్లయితే చట్ట ప్రకారం శిక్షకు గురవుతారని అధికారులు హెచ్చరించారు. అంతకుముందు నలుగురు దక్షిణ కొరియన్లు అనుమతి లేకుండా ఉక్రెయిన్‌కు ప్రయాణించి నిషేధాన్ని ఉల్లంఘించినందుకు వారికి శిక్ష విధించినట్లు నివేదికలు పేర్కొన్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించడానికి ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల కోసం చర్చలు జరగాలని దక్షిణ కొరియా ఉన్నతాధికారులు తెలిపారు. ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్యపరమైన ప్రయత్నాలను తమ వంతుగా కొనసాగిస్తామని పేర్కొన్నారు.

Tags:    

Similar News