Japan : జపాన్ నూతన ప్రధానిగా షిగేరు ఇషిబా.. త్వరలోనే ప్రమాణ స్వీకారం

దిశ, నేషనల్ బ్యూరో : జపాన్ తదుపరి ప్రధానమంత్రిగా 67 ఏళ్ల షిగేరు ఇషిబా త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.

Update: 2024-09-27 18:48 GMT

దిశ, నేషనల్ బ్యూరో : జపాన్ తదుపరి ప్రధానమంత్రిగా 67 ఏళ్ల షిగేరు ఇషిబా త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధాని పదవికి ఫుమియో కిషిడా గత నెలలో రాజీనామా చేసిన నేపథ్యంలో అధికార లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) ఆ పదవి కోసం షిగేరు ఇషిబాను శుక్రవారం ఎన్నుకుంది. ఈ కీలక పదవి కోసం తొమ్మిది మంది ఎల్డీపీ పార్టీ నేతలు హోరాహోరీగా పోటీ పడ్డారు. అధికార ఎల్డీపీ నిర్వహించిన మొదటి రౌండ్ ఎన్నిక ప్రక్రియలో 736 మంది పార్టీ క్యాడర్ ఓట్లు వేశారు. చివరి రౌండ్‌‌లో మొత్తం 415 మంది ఎల్డీపీ ముఖ్య నేతలు ఓట్లు వేశారు. వీటిలో షిగేరు ఇషిబాకు అత్యధికంగా 215 ఓట్లు పోల్‌ కాగా, సమీప ప్రత్యర్ధి, మహిళా అభ్యర్థి తకాయిచికి 194 ఓట్లు వచ్చాయి.

అధికార ఎల్డీపీ పక్ష నేతగా ఎన్నికవడంతో జపాన్ తదుపరి ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు షిగేరు ఇషిబాకు లైన్ క్లియర్ అయింది. పూర్తిగా అమెరికాపై ఆధారపడకుండా జపాన్‌ను స్వతంత్రంగా ముందుకు తీసుకెళ్లాలనే విజన్ తనకు ఉందని షిగేరు ఇషిబా గతంలో చాలాసార్లు వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి ఆయన విదేశాంగ విధానం ఇప్పటివరకు వచ్చిన జపాన్ ప్రధానుల కంటే భిన్నంగా, స్వతంత్రంగా ఉంటుందని స్పష్టమవుతోంది. ఎల్డీపీ పార్టీ పాలనా కాలం మరో సంవత్సర కాలమే మిగిలింది. ఈనేపథ్యంలో ఆయన ముందస్తు ఎన్నికలకు వెళ్లి పార్టీని మళ్లీ గెలిపించుకునే ప్రయత్నం చేయొచ్చని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.


Similar News