Pakistan caretaker PM : పాక్ కేర్ టేకర్ ప్రధానిగా అన్వరుల్ హక్ కాకర్
పాకిస్తాన్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాత్కాలిక (కేర్ టేకర్) ప్రధానమంత్రిగా పాక్ సెనేటర్ అన్వరుల్ హక్ కాకర్ ఎంపికయ్యారు. ఈవిషయాన్ని పాక్ ప్రధానమంత్రి కార్యాలయం శనివారం వెల్లడించింది. జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్) రద్దు అయినందున ఎన్నికలు జరిగే వరకు ఆయనే ప్రధానిగా ఉంటారు. బలూచిస్థాన్ అవామీ పార్టీ తరఫున సెనేటర్ గా పాక్ జాతీయ అసెంబ్లీకి అన్వరుల్ హక్ ఎన్నికయ్యారు. ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ రాజీనామాతో పార్లమెంట్ రద్దయిన నేపథ్యంలో నేషనల్ అసెంబ్లీలో జరిగిన అఖిలపక్షం సమావేశంలో తాత్కాలిక ప్రధాని పదవికి అన్వరుల్ హక్ పేరును ఖరారు చేశారు. ఆగస్ట్ 13న తాత్కాలిక ప్రధానిగా కాకర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు విపక్ష నేత, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ అవినీతి కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. పైకోర్టులో ఆయన అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. అందులో వచ్చే తీర్పుపైనే ఇమ్రాన్ భవితవ్యం ఆధారపడి ఉంది.