ఉక్రెయిన్‌పై మరోసారి విరుచుకుపడ్డ రష్యా: ఖార్కివ్‌పై 38 డ్రోన్లతో దాడి..ఆరుగురు మృతి

ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. దేశంలోనే రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌పై శనివారం తెల్లవారు జామున డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ఆరుగురు పౌరులు మరణించగా.. 10మంది తీవ్రంగా గాయపడ్డట్టు ఖార్కివ్ మేయర్ ఇహోర్ టెరెఖోవ్ వెల్లడించారు.

Update: 2024-04-06 09:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. దేశంలోనే రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌పై శనివారం తెల్లవారు జామున డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ఆరుగురు పౌరులు మరణించగా.. 10మంది తీవ్రంగా గాయపడ్డట్టు ఖార్కివ్ మేయర్ ఇహోర్ టెరెఖోవ్ వెల్లడించారు. అంతేగాక ఈ దాడిలో తొమ్మది ఎత్తైన భవనాలు, అనేక ప్రభుత్వ పరిపాలనా భవనాలతో సహా ఒక పెట్రోల్ స్టేషన్, ఒక సర్వీస్ స్టేషన్ దెబ్బతిన్నట్టు తెలిపారు. రష్యా సైన్యం 32 డ్రోన్లు, ఆరు క్షిపణులను ఖార్కివ్ నగరంపై ప్రయోగించినట్టు ఉక్రెయిన్ సైన్యం పేర్కొంది. ఇందులో 28 డ్రోన్లు, 3క్షిపణులను తమ దళాలు ధ్వంసం చేశాయని తెలిపింది.

అంతకుముందు రెండు రోజుల క్రితం ఇదే నగరంపై దాడి జరగగా నలుగురు వ్యక్తులు మరణించారు. రష్యా దాడుల నేపథ్యంలో ఖార్కివ్, రాజధాని కీవ్‌ సహా దేశంలోని పలు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఉక్రెయిన్ ఈశాన్య ప్రాంతంలోని ఖార్కివ్ నగరాన్ని రష్యా ఇటీవల లక్ష్యంగా చేసుకుంది. పదే పదే ఈ నగరంపై డ్రోన్లతో అటాక్ చేస్తోంది. మరోవైపు ఉక్రెయిన్‌లోని దక్షిణ నగరమైన జపోరిజ్జియాపై రష్యా శుక్రవారం ఐదు క్షిపణులను ప్రయోగించింది. ఈ ఘటనలోనూ నలుగురు వ్యక్తులు మరణించారు. 20 మందికి పైగా గాయపడ్డారు. 

Tags:    

Similar News