నాసా పెట్టిన ఈ వీడియో ఎక్కువసేపు చూస్తే లోపలికే.. జాగ్రత్త?
ఈ ఖగోళ నిర్మాణం లోపల ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. Recently posted NASA video of a black hole goes viral in Internet
దిశ, వెబ్‌డెస్క్ః బ్లాక్ హోల్స్ అంటేనే ఒక ఎనిగ్మా. ఎవ్వరికీ తెలియని ఈ ఖగోళ నిర్మాణం లోపల ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే, ఈ బ్లాక్‌హోల్‌కి వెళ్లి తిరిగొస్తేనే కదా అక్కడ ఏం జరుగుతుందో చెప్పడానికి..?! అందుకే, బ్లాక్ హోల్‌కు ఉన్న గురుత్వాకర్షణ శక్తి అనూహ్యమైనదని మాత్రమే ఇప్పటికి చెప్పగలిగారు. ఇక, ఈ విశ్వంలోని అత్యంత వేగవంతమైన అస్తిత్వం గల కాంతి కూడా ఈ కాల రంధ్రం పట్టులో నుండి తప్పించుకోలేదంతే! అలాంటి ఈ విశ్వ అద్భుతాన్ని NASAతో పాటు ప్రపంచంలోని ఇతర అంతరిక్ష సంస్థలు నిరంతరం అధ్యయనం చేస్తుంటాయి. అంతేనా, మనం ఆశ్చర్యపోయేలా అందమైన ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తాయి. ఇలాగే, తాజాగా నాసా పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది.
"ఈ విజువలైజేషన్ బ్లాక్ హోల్ అంచున కనిపించే దృశ్యాన్ని చూపిస్తుంది. ఇక్కడ ఇన్‌బౌండ్ పదార్థం సన్నని, వేడి నిర్మాణంలో సేకరించబడుతుంది. దీన్ని అక్రెషన్ డిస్క్ అని పిలుస్తారు. ఇక, బ్లాక్ హోల్‌కు ఉన్న విపరీతమైన గురుత్వాకర్షణ డిస్క్ వివిధ భాగాల నుండి వచ్చే కాంతి మార్గాలను మార్చుతూ ఉంటుంది. ఈ పదార్థం వలయాలు పైన, క్రింద కనిపించేలా చేస్తుంది. మధ్యలో బ్లాక్ హోల్ నీడ ఉంటుంది. ఇది ఈవెంట్ హోరిజోన్ కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ పరిమాణంలో ఉంటుంది. దాన్ని పాయింట్ ఆఫ్ నో రిటర్న్" అని నాసా అంటుంది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది నాసా. ఇక, ఈ వీడియోను పోస్ట్ చేసిన 13 గంటల్లోనే 2 మిలియన్లకు పైగా వ్యూవ్స్ పొందింది.