డొనేషన్ బాక్స్‌లో అరుదైన కరెన్సీ.. దాన్ని వేలం వేస్తే రూ.1.3 కోట్లు..!
ఊహించినదాని కంటే అధిక మొత్తాన్ని సంపాదించింది. Rare bank note spotted among donated items in UK.
దిశ, వెబ్‌డెస్క్ః ప్రపంచం చాలా వింతైనది. ఒక్కోసారి పనికిరానిది కూడా అత్యంత విలువను సంతరించుకుంటుంది. ఇక, చరిత్రను చూపించే అత్యంత పాతవి ఏవైనా వాటికి ఎన్నో రెట్లు రేటు ఉంటుంది. అలాగే, ఈసారి యూకేలో మరొక వింత విక్రయం బయటపడింది. విరాళంగా ఇచ్చిన ఓ వస్తువుల పెట్టెలో దొరికిన అరుదైన 100 పాలస్తీనా పౌండ్ల బ్యాంక్ నోటు, భారీగా £140,000 (రూ. 1.3 కోట్లకు పైగా)కు విక్రయించబడింది. ఈ అరుదైన నోటు కోసం మిడిల్ ఈస్ట్ నుండి యుఎస్ వరకు ప్రపంచవ్యాప్తంగా బిడ్లను ఆహ్వానించినట్లు UK వార్తా సంస్థలు నివేదించాయి.
ఎసెక్స్ కౌంటీలో ఉన్న నాన్ ప్రాఫిట్ సంస్థ ఆక్స్‌ఫామ్ వాలంటీర్ దీన్ని గుర్తించగా, పాల్ వైమాన్ అనే స్వచ్ఛంద సేవకుడు, ఇలాంటి నోట్‌లు ప్రపంచంలో కేవలం 10 మాత్రమే ఉన్న బ్యాంకు నోట్లుగా గుర్తించాడు. ఈ నోట్లను 1927లో బ్రిటిష్ మాండేట్ ఆఫ్ పాలస్తీనాకు చెందిన ఉన్నత స్థాయి అధికారులకు అందించారని తెలుసుకొని, సదరు వాలంటీర్ వేలం హౌస్‌ను సంప్రదించారు. దాని విలువ £30,000 (సుమారు రూ. 29 లక్షలు)గా నిర్ణయించగా, ఊహించినదాని కంటే అధిక మొత్తాన్ని సంపాదించింది. ఇక, ఈ బ్యాంకు నోట్‌పై వచ్చిన వేలం డబ్బు ఆక్స్‌ఫామ్ ఆధ్వర్యంలో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు ఉపయోగించనున్నట్లు అధికారులు తెలిపారు. "ప్రపంచంలో అత్యంత పేద ప్రజలకు సహాయపడే ఆక్స్‌ఫామ్ కోసం నేను చాలా డబ్బును సాధించాను" అని ఆ వాలంటీర్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.