బ్రేకింగ్ : ఇరాన్ అధ్యక్షుడు, విదేశాంగ మంత్రి మృతి ?
దిశ, నేషనల్ బ్యూరో : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీ (63) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ఘోర ప్రమాదానికి గురైంది.
దిశ, నేషనల్ బ్యూరో : ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీ (63) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం ఘోర ప్రమాదానికి గురైంది. అజర్ బైజాన్ దేశ పర్యటన ముగించుకొని ఇరాన్‌కు తిరిగి వస్తుండగా తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని జోల్ఫా సమీపంలో ఎత్తైన మంచు పర్వతాల వద్ద ఈ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ హెలికాప్టర్‌లోనే ఇబ్రహీం రయీసీతో పాటు ఇరాన్ విదేశాంగ మంత్రి హోసేన్ అమీర్ అబ్దుల్లా హియాన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయంటూ ఇరాన్ ప్రభుత్వ వర్గాలు అంతర్జాతీయ మీడియాకు ఆదివారం రాత్రి తెలిపాయి. హెలికాప్టర్ కూలిపోయిన ప్రాంతంలో ప్రతికూల వాతావరణం ఉండటంతో సహాయక చర్యలు చేపట్టడం కష్టతరంగా ఉందని వెల్లడించాయి. ఈమేరకు వివరాలతో ఇరాన్ అధికారిక మీడియా సంస్థ ఇర్నా (IRNA) కూడా వార్తలను ప్రసారం చేసింది. దేశవ్యాప్తంగా ప్రజలు అధ్యక్షుడు ఇబ్రహీం రయీసీ కోసం ప్రార్థనలు జరుపుతున్న సీన్లను ఇర్నా (IRNA) టీవీలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. మరోవైపు ఇరాన్ ప్రభుత్వం అధికారిక కార్యక్రమాలన్నింటిని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. తూర్పు అజర్‌బైజాన్ ప్రావిన్స్‌లోని జోల్ఫా సమీపంలో దట్టమైన పొగమంచులో కాలినడకన పర్వత ప్రాంతాన్ని రెస్క్యూ బృందాలు శోధిస్తున్న సీన్లను ప్రత్యక్ష ప్రసారంలో చూపించారు. దీన్నిబట్టి ఇబ్రహీం రయీసీ, హోసేన్ అమీర్ అబ్దుల్లా హియాన్ ఇక ప్రాణాలతో ఉండకపోవచ్చనే అంచనాలు వెలువడ్డాయి. వాస్తవానికి ఇరాన్ నుంచి అజర్‌బైజాన్‌కు మూడు హెలికాప్టర్లు వెళ్లాయి. ఒక హెలికాప్టర్‌లో ఇబ్రహీం రయీసీ, హోసేన్ అమీర్ అబ్దుల్లా హియాన్ ఉండగా.. మిగతా రెండు హెలికాప్టర్లు వారికి రక్షణగా వెళ్లాయని అంటున్నారు. రక్షణగా వెళ్లిన హెలికాప్టర్లు సురక్షితంగానే ఉండగా.. ఇద్దరు కీలక ఇరాన్ నేతలు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మాత్రం కుప్పకూలడం గమనార్హం.
ఇబ్రహీం రయీసీ ఎవరు ?
63 ఏళ్ల ఇబ్రహీం రయీసీ తొలిసారి ఇరాన్ అధ్యక్ష పదవి కోసం పోటీ చేయగా ఓడిపోయారు. అయితే రెండో ప్రయత్నంలో 2021లో గెలిచి దేశ అధ్యక్షుడయ్యారు. అధికారం చేపట్టినప్పటి నుంచి ఆయన ఇస్లామిక్ నైతిక చట్టాలను దేశంలో కఠినంగా అమలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఉక్కుపాదంతో అణచివేశారు. ప్రపంచ అగ్రరాజ్యాలతో అణు చర్చలలో ఇరాన్ తరఫున బలమైన వాణిని వినిపించారు. ఇరాన్‌ను కూడా అణ్వస్త్ర శక్తి కలిగిన దేశంగా మారుస్తానని ఆయన పదేపదే చెబుతుండేవారు. ఇటీవల ఇజ్రాయెల్‌పై, పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై ఇరాన్, దానికి మద్దతుపలికే మిలిటెంట్ సంస్థలు దాడులు జరపడం వెనుక కూడా ఇబ్రహీం రయీసీ ఉన్నారని చెబుతుంటారు. గాజా కేంద్రంగా కార్యకలాపాలు నడిపే హమాస్ సంస్థకు అన్ని రకాల సహాయ సహకారాలను ఇరాన్ నుంచి అందించడంలో ఇబ్రహీం రయీసీ ముఖ్య పాత్ర పోషించారు. 85 ఏళ్ల ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ తర్వాత రయీసీకి ఆ హోదా దక్కుతుందని అంతా చెబుతుండేవారు.