Canada : కెనడా ప్రధానిగా జస్టిన్ ట్రూడో రాజీనామా..!
కెనడా (Canada) ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు.
దిశ, నేషనల్ బ్యూరో: కెనడా (Canada) ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం ఉన్న లిబరల్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి ఆయన వైదొలిగే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, రాజీనామా ఎప్పుడు చేస్తాడో సరైన ప్రణాళిక లేదని.. కాకపోతే నేషనల్ కాకస్ మీటింగ్ కు ముందే ఆయన పార్టీ పగ్గాలు వదిలే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే, బుధవారం నేషనల్ కాకస్ మీటింగ్ జరగనుంది. 2013 నుంచి లిబరల్ పార్టీ నేతగా జస్టిన్ ట్రూడో కొనసాగుతున్నారు. ఆ పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారంపై ఆయన కార్యాలయం స్పందిస్తే స్పష్టత వచ్చే అవకాశముంది.
త్వరలోనే ఎన్నికలు
అయితే, ఈ ఏడాది అక్టోబరులో కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. కాగా.. ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ ల చేతిలో లిబరల్స్ ఓడిపోతారని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పుడు ట్రూడో రాజీనామా చేస్తే లిబరల్ పార్టీకి శాశ్వత అధిపతి లేకుండా పోతారు. కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టేవ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ పరిపాలనను రాబోయే నాలుగేళ్లపాటు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ట్రూడో రాజీనామ చేస్తే.. ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం కన్పిస్తోంది. ఆర్థిక మంత్రి డొమినిక్ లెబ్లాంక్‌తో తాత్కాలిక నాయకుడిగా, ప్రధానిగా నియమించాలనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. అయితే, లెబ్లాంక్ నాయకత్వం కోసం పనిచేస్తే.. పార్టీకి ప్రయోజనం ఏమీ ఉండదని నిపుణులు చెబుతున్నారు.