రష్యా అధ్యక్షుడిగా పుతిన్ ప్రమాణం..ఐదోసారి బాధ్యతలు

రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఐదోసారి బాధ్యతలు చేపట్టారు. ఆ దేశ రాజధాని మాస్కోలోని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పుతిన్ రష్యా ప్రెసిడెంట్‌గా ప్రమాణం చేశారు.

Update: 2024-05-07 11:19 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ఐదోసారి బాధ్యతలు చేపట్టారు. ఆ దేశ రాజధాని మాస్కోలోని గ్రాండ్ క్రెమ్లిన్ ప్యాలెస్‌లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పుతిన్ రష్యా ప్రెసిడెంట్‌గా ప్రమాణం చేశారు. ఇప్పటికే 25ఏళ్ల పాటు అధికారంలో ఉన్న పుతిన్ మరో ఆరేళ్ల పాటు ఈ పదవిలో ఉండనున్నారు. దీంతో స్టాలిన్​ తర్వాత అత్యధిక కాలం రష్యా అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం పుతిన్ పదవీ కాలం 2030 వరకు ఉండనుంది. అయితే రాజ్యాంగ బద్దంగా మరో ఆరేళ్ల పాటు పోటీ చేయడానికి ఆయనకు అర్హత ఉంది. పుతిన్ తన పరిపాలనలో రష్యాను ఆర్థిక పతనం నుంచి ప్రపంచ భద్రతకు ముప్పు కలిగించే దేశంగా మార్చారు.

మార్చిలో జరిగిన రష్యా సార్వత్రిక ఎన్నికల్లో పుతిన్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. పుతిన్‌కు దాదాపు 88శాతం ఓట్లు వచ్చాయి. అతని ప్రత్యర్థి నికోలాయ్ ఖరిటోనోవ్‌కు కేవలం 4శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. 2000 సంవత్సరంలో పుతిన్ తొలిసారిగా అధ్యక్షుడయ్యారు. ఆ తర్వాత 2004, 2012, 2018లో కూడా ప్రెసిడెంట్‌గా ఎన్నికై బాధ్యతలు చేపట్టారు. మాస్కోలోని అన్ని విదేశీ దౌత్య కార్యాలయాల అధిపతులను పుతిన్ ప్రారంభోత్సవానికి హాజరుకావాలని ఆహ్వానించారు. అయితే పుతిన్ ప్రమాణ స్వీకారాన్ని బ్రిటన్ తో పాటు పాశ్చాత్య దేశాలు బహిష్కరించాయి. కొన్ని దేశాలు తమ రాయబారులను పంపించాయి. ఉక్రెయిన్‌పై దండయాత్ర కారణంగా వారు బహిష్కరించినట్టు తెలుస్తోంది.

ప్రమాణ స్వీకారం అనంతరం పుతిన్ మాట్లాడుతూ..రష్యా మరింత బలపడుతుందని తెలిపారు. శత్రువులుగా భావించే దేశాలతోనూ సంబంధాలను బలోపేతం చేస్తామని తెలిపారు. పాశ్చాత్య దేశాలతో చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు. రష్యాలో అభివృద్ధిని ఆపడానికి పాశ్చాత్య దేశాలు నిరంతరం ప్రయత్నిస్తున్నాయని, తమపై దాడి చేయడానికి ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్న పుతిన్ రాబోయే ఆరేళ్ల కాలంలో స్వదేశంలో, విదేశాల్లో ఏం చేస్తారో వేచి చూడాల్సిందే. 

Tags:    

Similar News