Pannun Case : ఖలిస్తానీ పన్నూ హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామం.. అమెరికాకు భారత బృందం
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాలో తలదాచుకుంటున్న ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
దిశ, నేషనల్ బ్యూరో : అమెరికాలో తలదాచుకుంటున్న ఖలిస్తానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పన్నూను హత్య చేసేందుకు భారత గూఢచార సంస్థ ‘రా’ (రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్)కు చెందిన ఏజెంట్లు కుట్ర పన్నారని అమెరికా ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను ఖండించిన భారత్.. దీనిపై దర్యాప్తునకు ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఈకేసుపై విచారణ జరిపేందుకు భారత దర్యాప్తు టీమ్‌ను తమ దేశంలోకి అడుగుపెట్టనిచ్చే ప్రసక్తే లేదని చెబుతూ వచ్చిన అమెరికా విదేశాంగ శాఖ ఇప్పుడు స్వరం మార్చింది.
కేసు విచారణ నిమిత్తం భారత దర్యాప్తు బృందం మంగళవారం రోజు వాషింగ్టన్ డీసీలో పర్యటిస్తుందని వెల్లడించింది. కేసు విచారణలో భాగంగా ఇప్పటిదాకా సేకరించిన సమాచారానికి అదనంగా ఇంకా ఏమైనా ఇన్‌పుట్స్ అవసరమైతే అమెరికాలో భారత దర్యాప్తు బృందం సేకరిస్తుందని యూఎస్ విదేశాంగ శాఖ తెలిపింది. న్యూయార్క్‌లో నివసిస్తున్న గురుపత్వంత్ సింగ్ పన్నూను కడతేర్చేందుకు నిఖిల్ గుప్తా అనే భారత సంతతి వ్యక్తిని భారత గూఢచార సంస్థలు వాడుకున్నాయని అమెరికా ఆరోపిస్తోంది. చెక్ రిపబ్లిక్ దేశంలో గతేడాది జూన్‌లో అరెస్టయిన నిఖిల్ గుప్తాను.. ఈ ఏడాది జూన్ 14న అమెరికాకు తీసుకొచ్చారు.