Pakisthan: బొగ్గుగని కార్మికులపై ముష్కరుల దాడి.. 20 మంది మృతి

పాకిస్థాన్‌లో విషాద ఘటన జరిగింది. బలూచిస్థాన్ ప్రావీన్సులోని బొగ్గుగని కార్మికులపై పలువురు ముష్కరులు దాడి చేశారు.

Update: 2024-10-11 09:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌లో విషాద ఘటన జరిగింది. బలూచిస్థాన్ ప్రావీన్సులోని బొగ్గుగని కార్మికులపై పలువురు ముష్కరులు దాడి చేశారు. ఈ ఘటనలో 20 మంది మైనర్లు మరణించగా, మరో ఏడు గురు తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం తెల్లవారుజామున దుకీ జిల్లాలోని బొగ్గు గనిలో పని చేస్తున్న కార్మికుల వసతి గృహాల్లోకి దుండగులు చొరబడ్డారు. అనంతరం అక్కడ ఉన్న కార్మికులందరిపై కాల్పులకు తెగపడ్డారు. దీంతో 20 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో ఎక్కువ మంది బలూచిస్థాన్‌లోని పష్తూన్ భాష మాట్లాడే ప్రాంతాలకు చెందిన వారని తెలుస్తోంది. మృతుల్లో ముగ్గురు, గాయపడిన వారిలో నలుగురు ఆఫ్ఘనిస్థాన్ వాసులు ఉన్నారు. విషయం తెలుసుకున్న భద్రతా బలగాలు ఘటనా స్థలానికి చేరుకుని దాడి చేసిన వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు.

బలూచిస్థాన్ వేర్పాటువాదుల హస్తం?

ఈ దాడుల వెనుక బలూచిస్థాన్ వేర్పాటు వాద గ్రూపుల హస్తం ఉన్నట్టు పలువురు అనుమానిస్తున్నారు. ఎందుకంటే కొద్ది రోజులుగా బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన ఉగ్రవాదులు పలు దాడులకు పాల్పడ్డారు. దీంతో తాజా ఘటనలోనూ వారి ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. అయితే అక్టోబర్ 16, 17 తేదీల్లో పాకిస్థాన్ అధ్యక్షతన ఇస్లామాబాద్‌లో ఎస్సీవో సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి చైనా ప్రధాని లీ కియాంగ్‌తో పాటు వివిధ దేశాధినేతలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలోనే ఉగ్ర ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో పాక్‌లో భారీగా భద్రతా బలగాలను మోహరించారు.

నాలుగు రోజుల్లోనే రెండో దాడి

పాక్‌లో నాలుగు రోజుల వ్యవధిలోనే రెండు ఘటనలు జరగడం గమనార్హం. అంతకుముందు అక్టోబర్ 6న కరాచీ విమానాశ్రయం సమీపంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, 11 మంది గాయపడ్డారు. దీనిపై చైనా రాయబార కార్యాలయం విచారణకు డిమాండ్ చేయగా.. పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ స్వయంగా విచారణకు నాయకత్వం వహిస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఆగస్టులో పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో జరిగిన వేర్వేరు ఉగ్రవాద దాడుల్లో కనీసం 73 మంది మరణించారు. ఈ దాడులన్నింటికీ బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) బాధ్యత వహించింది. 


Similar News