రేపే పాక్‌లో ఎన్నికలు.. ప్రధాన పోటీ ఆ రెండు పార్టీల మధ్యే !
దిశ, నేషనల్ బ్యూరో : రాజకీయ గందరగోళం, తీవ్రవాద భూతం, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌లో ఎట్టకేలకు గురువారం జాతీయ ఎన్నికలు జరగనున్నాయి.
దిశ, నేషనల్ బ్యూరో : రాజకీయ గందరగోళం, తీవ్రవాద భూతం, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌లో ఎట్టకేలకు గురువారం జాతీయ ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 90,582 పోలింగ్ స్టేషన్లలో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. పాకిస్తాన్‌లో పోలింగ్ ప్రక్రియ బ్యాలెట్ బాక్సులతోనే జరుగుతుంది. 24 కోట్ల దేశ జనాభాలో దాదాపు 12.85 కోట్ల మంది ఓటుహక్కును వినియోగించు కోనున్నారు. ఈసారి జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 5,121 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఒక్కో సీటుకు సగటున 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం అభ్యర్థుల్లో 94 శాతం (4,806) మంది పురుషులు కాగా, 312 మంది మహిళలు, ఇద్దరు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. అయితే 266 స్థానాల్లో ప్రత్యక్ష ఓటింగ్ జరగనుంది. 70 రిజర్వుడ్ సీట్లు ఉండగా.. వాటిలో 60 మహిళలకు, 10 ముస్లిమేతరులకు రిజర్వ్ చేశారు. కనీసం 169 మంది సభ్యుల మద్దతును పొందే రాజకీయ పార్టీ దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అర్హత సాధిస్తుంది.
ప్రధాన పోటీ ఆ పార్టీల మధ్యే..
పాకిస్తాన్‌లో ఎన్నికల సంఘం వద్ద రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలు 160కిపైగా ఉన్నాయి. అయితే ప్రధాన పోటీ మాత్రం నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్).. బిలావల్ భుట్టో, ఆసిఫ్ అలీ జర్దారీల నేతృత్వంలోని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) మధ్యే ఉంది. షరీఫ్‌కు బద్ధ విరోధిగా పేరొందిన మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయన పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్ - ఏ-ఇన్సాఫ్ (పీటీఐ)పై ఎన్నికల సంఘం బ్యాన్ విధించింది. ఆ పార్టీ గుర్తు అందుబాటులో లేకపోవడంతో.. ఇమ్రాన్ అనుచరులంతా ఈసారి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగారు. నవాజ్ షరీఫ్(74) ఈసారి గెలిచి అధికార పీఠం ఎక్కితే.. నాలుగోదఫా పాక్ ప్రధానిగా ఎన్నికైన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టిస్తారు.