Israel Gaza War: ఇజ్రాయెల్- గాజా యుద్ధానికి ఏడాది పూర్తి..!

ఇజ్రాయెల్‌-గాజా (Israel Gaza War) మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయ్యింది. గతేడాది అక్టోబర్ 7నే ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది.

Update: 2024-10-07 05:33 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్‌-గాజా (Israel Gaza War) మధ్య యుద్ధం ప్రారంభమై ఏడాది పూర్తయ్యింది. గతేడాది అక్టోబర్ 7నే ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(IDF) కీలక డేటాను వెల్లడించింది. గాజాలో 17 వేల మంది హమాస్ నేతలను, ఇజ్రాయెల్ లో వెయ్యి మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు ప్రకటించింది. హమాస్ గ్రూప్ ని పూర్తిగా ధ్వంసం చేశామంది. వీరిలో 30 మంది హమాస్‌ బెటాలియన్‌, 165 మంది కంపెనీ కమాండర్లను మట్టుబెట్టినట్లు తెలిపింది. గాజాపట్టీలో 40,300 లక్ష్యాలపై దాడులు చేశామని.. మొత్తం 4,700 సొరంగ మార్గాలను ధ్వంసం చేసినట్లు పేర్కొంది.

గతేడాది నుంచే హెజ్ బొల్లాపై దాడులు

అక్టోబర్‌ 8 నుంచి లెబనాన్‌లోని హెజ్‌బొల్లాపై కూడా దాడులు ప్రారంభించామని ఇజ్రాయెల్ వెల్లడించింది. హెజ్ బొల్లాకు చెందిన మొత్తం 800 మందిని మట్టుబెట్టగా వీరిలో 90 మంది టాప్‌ కమాండర్లు ఉన్నట్లు పేర్కొంది. 11 వేల హెజ్‌బొల్లా స్థావరాలను పేల్చేశామంది. ఏడాది వ్యవధిలో 26,000 రాకెట్లతో దాడులు జరిగాయని.. వీటిల్లో గాజా నుంచి 13,200, లెబనాన్‌ నుంచి 12,400 ప్రయోగించినట్లు వెల్లడించింది. యెమన్‌, సిరియా, ఇరాన్‌ల నుంచి మిగతా రాకెట్ దాడులు జరిగాయాంది. వీటిల్లో వందల సంఖ్యలో రాకెట్లు ఆయా ప్రాంతాల్లోనే కూలిపోయినట్లు వెల్లడించింది. ఇక మొత్తం 728 మంది తమ సైనికులు, రిజర్విస్టులు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పింది. ఇకపోతే, గతేడాది అక్టోబర్‌ 7న ఇజ్రాయెల్‌పైకి హమాస్‌ బలగాలు విరుచుకుపడ్డాయి. ఆ దాడుల్లో మొత్తం 1,200 మంది ఇజ్రాయెలీలు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో 251 మంది కిడ్నాప్‌ అయ్యారు. వీరిలో కొందరిని విడిపించగా.. మరికొందరు చనిపోయారు. ఇప్పటికీ దాదాపు వంద మంది హమాస్ దగ్గర బందీలుగానే ఉన్నారు.


Similar News