Israel-Hamas: నెక్స్ట్ వారంలో ఇజ్రాయోల్-హమాస్ మధ్య సంధి చర్చలు
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికి ఇజ్రాయెల్ మాత్రం హమాస్‌పై దాడులు ఆపడం లేదు.
దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పటికి ఇజ్రాయెల్ మాత్రం హమాస్‌పై దాడులు ఆపడం లేదు. ఇప్పటికే ఈ యుద్ధంలో దాదాపు 40 వేల మందికి పైగా చనిపోయారు. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, యుద్ధాన్ని ముగించడానికి ఇజ్రాయెల్-హమాస్ మధ్య సంధి చర్చలు ఆగస్టు 15 న జరగబోతున్నాయి. అమెరికా, ఈజిప్ట్, ఖతార్ మధ్యవర్తిత్వం చేయడం ద్వారా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దీనికి అంగీకరించారు. ఈ చర్చల్లో ప్రధానంగా గాజా కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందాన్ని ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ చర్చలు దోహా లేదా కైరోలో జరగవచ్చని తెలుస్తుంది.
ఇజ్రాయెల్ తమ దేశం నుంచి చర్చల కోసం ఒక ప్రతినిధి బృందాన్ని పంపుతుందని ఆ దేశ అధికారిక వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. అయితే ఈ చర్చలపై హమాస్ ఇంకా స్పందించలేదు. US పరిపాలన సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ, యుద్దాన్ని ముగించడానికి రెండు వైపుల నుంచి సానుకూల అభిప్రాయం వ్యక్తం కావాలి. అయితే ఈ చర్చలు జరిగేలోపు ఎలాంటి తీవ్రమైన దాడులు చోటుచేసుకోకుండా ఉంటే ఇది సాఫీగా సాగుతుందని అన్నారు. ఇజ్రాయెల్‌పై ఇప్పటికే ఇరాన్, దాని మద్దతు గల హిజ్బుల్లా గ్రూపులు చాలా కోపంగా ఉన్నాయి. తమ నాయకుల హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలపై రాకెట్లతో దాడులు చేస్తున్నాయి.