UN: భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన పాక్.. దీటుగా బదులిచ్చిన న్యూఢిల్లీ

అంతర్జాతీయ వేదికపై ఎన్నిసార్లు భంగపడినా పాకిస్థాన్ మాత్రం వక్రబుద్ధిమార్చుకోలేదు. ఐక్యరాజ్యసమితి వేదికపై జమ్ముకశ్మీర్‌ (Jammu and Kashmir)పై అనవసర ప్రస్తావన తీసుకొచ్చిన దాయాదికి న్యూఢిల్లీ వార్నింగ్ ఇచ్చింది.

Update: 2025-03-25 09:46 GMT
UN: భారత్ పై మరోసారి అక్కసు వెళ్లగక్కిన పాక్.. దీటుగా బదులిచ్చిన న్యూఢిల్లీ
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: అంతర్జాతీయ వేదికపై ఎన్నిసార్లు భంగపడినా పాకిస్థాన్ మాత్రం వక్రబుద్ధిమార్చుకోలేదు. ఐక్యరాజ్యసమితి వేదికపై జమ్ముకశ్మీర్‌ (Jammu and Kashmir)పై అనవసర ప్రస్తావన తీసుకొచ్చిన దాయాదికి న్యూఢిల్లీ వార్నింగ్ ఇచ్చింది. చట్టవిరుద్ధంగా జమ్ముకశ్మీర్ లో ఆక్రమించిన ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సిందేనని తేల్చిచెప్పింది. ఐక్యరాజ్యసమితి (United Nations)లో శాంతి పరిరక్షణ సంస్కరణలపై చర్చ సందర్భంగా పాక్‌ ప్రతినిధి సయ్యద్‌ తారిఖ్‌ ఫతేమీ జమ్ముకశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ.. యూఎన్ లోని భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ ఎదురుదాడికి దిగారు. పాకిస్థాన్ పదేపదే అనవసర అంశాలను అంతర్జాతీయ వేదికలపై లాగుతోందని మండిపడ్డారు. ‘‘భారత కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌పై పాకిస్థాన్‌ ప్రతినిధి మరోసారి అనవసర వ్యాఖ్యలు చేశారు. ఇలా పదేపదే ఈ అంశాన్ని లేవనెత్తడం వల్ల వారు చేసే చట్టవిరుద్ధ వాదనలు నిజంకావు. ఇలాంటి ప్రయత్నాలతో వారు ప్రోత్సహిస్తున్న సీమాంతర ఉగ్రవాదాన్ని సమర్థించుకోలేరు. జమ్మూకశ్మీర్‌ ఇప్పటికీ, ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. ఈ ప్రాంతంలోని కొంత భూభాగం ఇప్పటికీ పాక్‌ ఆక్రమణలోనే ఉంది. దాన్ని ఖాళీ చేయాల్సిందే. ఈ వేదిక దృష్టిని మళ్లించే కుతంత్రాలు చేయడం మానుకుంటే మంచిది. భారతదేశం మరింత విస్తృతమైన సమాధానం చెప్పే హక్కును ఉపయోగించకుండా ఉంటుంది’’ అని పర్వతనేని హరీశ్‌ దాయాదికి హితవు పలికారు.

జెనీవాలోనూ జమ్ముకశ్మీర్ ప్రస్తావన

ఇకపోతే, గత వారం జెనీవాలో జరిగిన ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHR) సమావేశంలో పాకిస్థాన్ జుమ్ముకశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. దీనికి అంతే దీటుగా భారత్ బదులిచ్చింది. పాక్ పదే పదే అసత్యప్రచారాలు చేస్తోందని మండిపడింది. పాకిస్తాన్‌తో సాధారణ, శాంతియుత సంబంధాలను కోరుకుంటున్నామని భారత రాయబారి క్షితిజ్ త్యాగి అన్నారు. అయితే, రెండు దేశాల మధ్య ఏదైనా అర్థవంతమైన సంభాషణ జరగడానికి ఉగ్రవాదం, శత్రుత్వం లేని వాతావరణాన్ని పెంపొందించే బాధ్యత ఇస్లామాబాద్ పై ఉందని చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News