ట్రంప్ పై కాల్పుల ఘటనను పట్టించుకోని టైమ్ స్క్వేర్.. మహిళా డాక్టర్ సంచలన ట్వీట్
ట్రంప్ పై కాల్పుల ఘటనపై ఓ మహిళా డాక్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై తుపాకీ కాల్పుల దాడి ఘటన ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపుతున్నది. రిపబ్లికన్ పార్టీ తరపున మరోసారి ప్రెసిడెంట్ రేస్ లో ఉన్న ఆయన ఇవాళ పెన్సిల్వేనియాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఆయనపై ఓ దుండగుడు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో బుల్లెట్ ట్రంప్ చెవిని గాయపరుస్తూ దూసుకుపోయింది. తృటిలో ప్రణాపాయం నుంచి ట్రంప్ తప్పించుకోగలిగారు. ఈ కాల్పులకు సంబంధించిన వార్త క్షణాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ లో మాత్రం ఈ వార్త ప్రసారం కాలేదట. ట్రంప్ పై కాల్పులు జరిగితే టైమ్ స్క్వేర్ లో ఈ కాల్పులకు సంబంధించి సింగిల్ వీడియో ప్రసారం చేయలేదని అమెరికా ఫ్రంట్‌లైన్ డాక్టర్స్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డా. సిమోన్ గోల్డ్ సంచలన ట్వీట్ చేశారు. ట్రంప్ పై దాడి జరిగినప్పుడు నేను టైమ్స్ స్క్వేర్ మధ్యలో ఉన్నాను. ట్రంప్‌పై కాల్పులు జరిగినట్లు ఒక్క వీడియో కూడా మానిటర్ లలో ప్రదర్శించబడలేదు.సెన్సార్‌షిప్, ప్రచారం లోతు తనను ఆశ్చర్యపరుస్తుంది అని పోస్టులో రాసుకొచ్చారు. అయితే ట్రంప్ పై దాడి ఘటనను ప్రపంచ దేశాదినేతలు స్పందిస్తుంటే ప్రముఖమైన టైమ్ స్క్వేర్ పట్టించుకోలేదంటూ సిమోన్ గోల్డ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఈ పోస్టుపై నెటిజన్లు స్పందిస్తూ చాలా మంది అమెరికన్లు తమ మీడియా చైనా, ఉత్తర కొరియా మొదలైన వాటి కంటే భిన్నంగా లేదని గ్రహించలేకపోయారని కామెంట్ చేస్తున్నారు.
మార్కెట్ ను ముంచెత్తిన ట్రంప్ టీ షర్టులు:
మరో వైపు ఈ దాడి జరిగిన మూడు గంటల్లోపే చైనా మార్కెట్లలో ట్రంప్ టీషర్టులు పొటెత్తాయి. దాడి జరిగాక ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో టీ షర్టులపై ముద్రించి వ్యాపారులు అమ్మకానికి పెట్టారు. 'ఐ విల్ నెవ్వర్ స్టాప్, ఫైట్ ఫర్ అమెరికా', 'షూటింగ్ మేక్స్ మీ స్ట్రాంగర్' అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను వీటిపై ముద్రించారు. వీటిని కొనుగోలు చేసేందుకు అమెరికన్స్ ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ దాడి తర్వాత ట్రంప్ కు ప్రజల్లో అమాంతం మద్దతు పెరిగినట్లు పోల్ స్టర్ తాజా నివేదికలో వెల్లడించింది. ట్రంప్ క్రేజ్ ఒక్కసారిగా 8 శాతం పెరిగినట్లు ఈ నివేదిక పేర్కొంది. ఈ పరిణామంతో జోబైడెన్ కంటే ట్రంప్ ముందు వరుసలో ఉన్నారని, దేశ అధ్యక్షుడిగా ట్రంప్ గెలిచేందుకు 70 శాతం అవకాశాలు ఉన్నట్లు ఈ సర్వే అంచనా వేసింది.