ఉత్తర కొరియా మరో క్షిపణి ప్రయోగం: అమెరికా తీరుపై తీవ్ర ఆగ్రహం
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ దక్షిణ కొరియాలో పర్యటించిన నేపథ్యంలో ఉత్తరకొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దక్షిణ కొరియా మీదుగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ దక్షిణ కొరియాలో పర్యటించిన నేపథ్యంలో ఉత్తరకొరియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దక్షిణ కొరియా మీదుగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. నార్త్ కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌కు ఆగ్నేయంగా ఉన్న ప్రావిన్స్ నుంచి సోమవారం ఉదయం స్వల్ప-శ్రేణి బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్టు దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. దీనిని జపాన్ కూడా ధ్రువీకరించింది. ‘ఉత్తర కొరియా తూర్పు తీరంలోని జలాల వైపు మూడు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఇది గరిష్టంగా 50 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంది. అంతేగాక సుమారు 350 కిలోమీటర్లు ప్రయాణించింది’ అని ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాదిలో ఇది రెండో క్షిపణి ప్రయోగం కావడం గమనార్హం. గతంలో జనవరి 14న కూడా బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది.
అమెరికాకు దక్షిణ కొరియా మిత్ర దేశంగా ఉంది. సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ యూఎస్‌తో సంబంధాలను మరింత పెంచుకోవాలని భావిస్తున్నారు. ఉత్తర కొరియాకు వ్యతిరేకంగా అమెరికా, జపాన్‌లతో కలిసి శక్తి సామర్థ్యాలను కూడ గట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవలే యూఎస్, దక్షిణ కొరియాలు తమ వార్షిక ఫ్రీడమ్ ఫీల్డ్ వ్యాయామాలను కొనసాగించాయి. ఇందులో అనేక సైనిక విన్యాసాలు చేపట్టారు. ఈ కసరత్తుల టైంలోనూ కిమ్ కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. దక్షిణ కొరియాను నిర్మూలించే చట్టపరమైన హక్కు తనకు ఉందని చెప్పాడు. అంతేగాక యూఎస్, దక్షిణ కొరియాలపై తరచూ విరుచుకుపడుతున్నారు.
కాగా, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ దక్షిణ కొరియా ఉన్నతాధికారులతో భేటీ, ప్రజాస్వామ్య శిఖరాగ్ర సదస్సు నిమిత్తం అక్కడికి చేరుకున్నారు. ఈ మీటింగ్ ఈ నెల 20వరకు జరగనుంది. దక్షిణ కొరియా ప్రజా ప్రతినిధులతోనూ బ్లింకెన్ చర్చలు జరపనున్నారు. అనంతరం బ్లింకెన్ ఫిలిప్పీన్స్ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరకిరియా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించారు. మరోవైపు ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో కిమ్ రష్యాకు అత్యాధునిక ఆయుధాలు అందజేస్తున్నట్టు తెలుస్తోంది.