Nigeria: నైజీరియాలో విషాదం.. పెట్రోల్ ట్యాంకర్ పేలి 94 మంది మృతి

ఆఫ్రికా దేశం నైజీరియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంధన ట్యాంకర్ పేలి 94 మంది మృతి చెందగా.. మరో 50 మంది గాయపడ్డారు.

Update: 2024-10-16 11:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఆఫ్రికా దేశం నైజీరియాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇంధన ట్యాంకర్ పేలి 94 మంది మృతి చెందగా.. మరో 50 మంది గాయపడ్డారు. జిగావా ప్రావీన్సులో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పెట్రోల్ ట్యాంకర్ నడుపుతున్న డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో ఆ ట్యాంకర్ అదుపుతప్పి ప్రావీన్సులోని యూనివర్సిటీ సమీపంలో ఓ హైవేపై బోల్తా పడింది. విషయం తెలుసుకున్న స్థానికులు ఆయిల్‌ను దొంగిలించడానికి ట్యాంకర్ వద్ద భారీగా గుమిగూడారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా ట్యాంకర్ పేలి పోయింది. భారీగా మంటలు వ్యాపించడంతో 94 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా..50 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను రింగిమ్, హడేజియా పట్టణాల్లోని ఆస్పత్రులకు తరలించారు. గాయపడ్డ వారిలోనూ పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారి లావాన్ ఆడమ్ తెలిపారు. కాగా, గత నెలలోనూ నైజీరియాలో ఇంధన ట్యాంకర్ మరొక ట్రక్కును ఢీకొనడంతో పేలుడు సంభవించి 48 మంది మరణించారు.


Similar News