'ఇంత పెద్దదా..' అని గిన్నీస్ రికార్డుకు పంపితే.. అది నిజమైంది కాదన్నారు?!
గిన్నీస్ రికార్డు సాధించి తీరతామని అంటున్నారు ఈ దంపతులు. New Zealand Couple found a Giant potato is actually a tuber
దిశ, వెబ్‌డెస్క్ః అనుకున్నదొక్కటీ, అయినది ఒక్కటీ అన్న తరహాలో పాపం ఓ న్యూజీలాండ్ దంపతులకు వరల్డ్ రికార్డ్స్ మిస్ అయ్యింది. హామిల్టన్ సమీపంలోని తమకున్న కొద్ది పొలంలో భారీ సైజు బంగాళదుంప బయటపడింది. దాన్ని చూసి మురిసిపోయిన దంపతులు ప్రపంచంలోనే అతిపెద్ద బంగాళాదుంపను తవ్వామని, ఇలాంటిది ఎక్కడికెళ్లినా దొరకదని నమ్మి ఏకంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వారికి పంపించారు. అయితే, సంబంధిత అధికారులు దాన్ని శాస్త్రీయ పరీక్షలకు పంపగా అది బంగాళాదుంప కాదని తెలిసింది.
కోలిన్ క్రెయిగ్-బ్రౌన్, గత ఆగస్టులో తన భార్య డోనాతో కలిసి తోటపని చేస్తున్నప్పుడు ఈ దుంప కనిపించింది. ఇది ఖచ్చితంగా బంగాళాదుంపలా కనిపిస్తుందని, ఎంతో రుచిగా ఉందని భార్యతో చెప్పాడు. ఇద్దరు కలిసి, రికార్డు సృష్టిద్దామని అనుకున్నారు. దానికి సంబంధించిన ఫోటోలు, వివరాలు రాత పూర్వకంగా సమర్పించిన నెలల తర్వాత, ఈ జంటకు గత వారం ఇమెయిల్‌లో గిన్నిస్ నుండి బ్యాడ్ న్యూస్ అందింది. గిన్నీస్ రికార్డు పోతే పోయింది కానీ ఈ దుంప మాత్రం స్థానికంగా సెలబ్రిటీగా మారింది. అంతేనా, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన దీని ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతున్నాయి. 7.8 కిలోలున్న ఈ దుంప అసల బంగాళ దుంప కాకపోయినా ఈసారి ఇంతకంటే పెద్ద బంగాళదుంపను పెంచి, గిన్నీస్ రికార్డు సాధించి తీరతామని అంటున్నారు ఈ దంపతులు. ఆల్ ది బెస్ట్, మరి!