ఈ పాలపుంతలోనే ఏలియన్లు ఉన్నారా..?! కొత్త స్టడీలో ఆసక్తికర ఆన్సర్
డైసన్ గోళాలపై తెలివైన గ్రహాంతర జీవులు ఉండవచ్చని పేర్కొన్నారు. the answer to alien life in Milky Way.
దిశ, వెబ్‌డెస్క్ః ఈ అనంత విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా..? ఇది ఎప్పటి నుంచో శాస్త్రవేత్తలను వేధిస్తున్న ప్రశ్న. మనలాంటి వాళ్లే కాకపోయినా, మరో రూపంలో విజ్ఞానవంతమైన జీవుల ఉనికి ఉంటుందని తెలిసినా, ఆధారాలు మాత్రం ఇంకా దొరకలేదు. వీటి కోసం అనేక సంవత్సరాలుగా, అనేకమంది పరిశోధకులు, విశ్వంలోని సుదూర మూలల్లో గ్రహాంతర జీవులకు సంబంధించి, ఏదైనా ఒక్క జాడను కనుక్కోడానికి ప్రయత్నించారు. కానీ, ఇప్పటి వరకు ఏ అధ్యయనాల నుండి ఖచ్చితమైన రుజువు బయటకు రాలేదు. అయితే, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్‌లోని ఒక ప్రొఫెసర్ మాత్రం ఆధారాలకు సంబంధించి ఆసక్తికర అంశాలను వెల్లడించారు. పాలపుంతలోని తెల్ల మరగుజ్జు నక్షత్రాల చుట్టూ ఉన్న డైసన్ గోళాలపై తెలివైన గ్రహాంతర జీవులు ఉండవచ్చని పేర్కొన్నారు. ఫిజిక్స్, ఖగోళ శాస్త్రాన్ని బోధించే ప్రొఫెసర్ బెన్ జుకర్‌మాన్ 'డైసన్ గోళాలలో గ్రహాంతరవాసుల ఉనికి'పై దృష్టి సారించే కొత్త అధ్యయనాన్ని రచించారు.
డైసన్ గోళాలు అంటే ఒక నక్షత్రం చుట్టూ ఉన్న ఊహాజనిత నిర్మాణాలు. ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త ఫ్రీమాన్ డైసన్ పేరు మీద ఉన్న ఈ గోళాలు, నక్షత్రం ఉత్పత్తి చేసే శక్తిని భారీ మొత్తంలో సంగ్రహించుకుంటాయి. ఈ తాజా అధ్యయనం ప్రకారం, ఏదైనా గ్రహం మీద గ్రహాంతర జీవులు ఉన్నట్లయితే, వాళ్లు విశ్వంలో తిరగడం కంటే తమ నక్షత్రం చుట్టూ డైసన్ గోళాన్ని సృష్టించడానికే ఇష్టపడతారని అధ్యయనం సూచించింది. ఫలితంగా, ఈ గోళాల అధ్యయనం తెల్ల మరగుజ్జు నక్షత్రంపై గ్రహాంతర జీవుల ఉనికికి సంబంధించి కీలక ఆధారాలను అందిస్తాయిని పేర్కొన్నారు. విశ్వంలో ఉన్న గ్రహాంతర నాగరికతల సంఖ్యను ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి డైసన్ గోళాలు శాస్త్రవేత్తలకు అవకాశం ఇస్తాయిని అధ్యయనం ప్రతిపాదించింది.