ఆ ఉగ్రవాదిని కూడా చంపేశాం.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన

Update: 2024-10-09 07:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: హెజ్బొల్లా అధిపతి హసన్‌ నస్రల్లాను మట్టుబెట్టిన వారం రోజుల్లోనే అతడి వారసుడిగా ప్రచారంలో ఉన్న హషీమ్ సైఫుద్దీన్‌ (Hashim Saifuddin)ను కూడా అంతమొందించామంటూ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు. లెబనాన్‌ (Lebanon)లోని దాహియాలో ఉన్న ఓ బంకర్‌లో హెజ్బొల్లా (Hezbollah)కి సంబంధించిన సీనియర్ నేతలతో హషీమ్ భేటీకానున్నాడనే పక్కా సమాచారం అందడంతో ఇజ్రాయెల్ ఆఘమేఘాల మీద ఆ ప్రాతంపై మిసైళ్ల వర్షం కురిపించింది. అనంతరం ఈ దాడుల్లో సైఫుద్దీన్ తప్పించుకోలేకపోయాడని, అక్కడే మరణించాడని ఇజ్రాయెల్ ప్రకటించింది.

కాగా.. హసన్ నస్రల్లా (Hassan Nasrallah)కు దగ్గరి బంధువైన హషీమ్‌ ప్రస్తుతం హెజ్‌బొల్లా కార్యనిర్వాహక మండలి అధిపతిగా, జిహాద్‌ కౌన్సిల్‌లో సభ్యుడిగా కొనసాగాడు. 2017లో అగ్రరాజ్యం అమెరికా హషీమ్‌ను ఉగ్రవాదిగా ప్రకటించింది. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లో లెబనాన్ రాజధాని బీరుట్‌ (Berut)లోని దాహియాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో నస్రల్లా మరణించడంతో హెజ్బొల్లా పగ్గాలు హషీమ్‌కి అప్పగించనున్నట్లు వార్తలొచ్చాయి.

ఇదిలా ఉంటే.. దక్షిణ లెబనాన్‌‌లోని హిజ్బుల్లా భూగర్భ కమాండ్ సెంటర్లపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (IDF) చేసిన భీకర వైమానిక దాడుల్లో 50 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అంతేకాకుండా ఈ యుద్ధం ముగియాలన్నా.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు ఆపాలన్నా వెంటనే ఆ దేశం హెజ్బొల్లాను దేశం నుంచి తరిమికొట్లాలని, లేదంటే గాజా (Gaza Strip)కు పట్టిన గతే పడుతుందని నెతన్యాహు హెచ్చరించారు.


Similar News