పాకిస్థాన్‌లో చర్చిలపై అల్లరిమూకల దాడి
పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్ జిల్లాలో చర్చిలను లక్ష్యంగా చేసుకుని అల్లరిమూకలు దాడులకు తెగబడ్డారు
లాహోర్: పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్ జిల్లాలో చర్చిలను లక్ష్యంగా చేసుకుని అల్లరిమూకలు దాడులకు తెగబడ్డారు. జరన్‌వాలా తహసీల్ లోని ఒక చర్చిలో దైవదూషణ జరిగిందన్న ఆరోపణలతో బుధవారం ఓ వర్గానికి చెందిన అల్లరిమూకలు కర్రలు, రాళ్లు చేతబట్టి రోడ్లపైకి వచ్చారు. ఈసా నగ్రి ప్రాంతంలోని ఆ చర్చి సిబ్బందికి చెందిన ఒక ఇంటిని కూల్చేయడంతో పాటు పరిసర ప్రాంతాల్లోని నాలుగు చర్చిల్లో విధ్వంసాన్ని సృష్టించారు. కొన్ని చర్చిలకు నిప్పు కూడా పెట్టినట్లు స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. అల్లరి మూకలు చర్చి సిబ్బందిపైనా దాడికి పాల్పడ్డారని వాటిలో పేర్కొన్నారు. కొందరు క్రైస్తవుల ఇళ్లలో లూటీలు చేశారని తెలిపారు. అయితే పోలీసులు ఆలస్యంగా రంగంలోకి దిగారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని స్థానిక పోలీసులు చెప్పారు.