Military drills: చైనా కవ్వింపు చర్యలు.. తైవాన్ చుట్టూ సైనిక విన్యాసాలు

చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. తైవాన్ సమీపంలో సోమవారం సైనిక విన్యాసాలు ప్రారంభించింది.

Update: 2024-10-14 08:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. తైవాన్ సమీపంలో సోమవారం సైనిక విన్యాసాలు ప్రారంభించింది. భారీగా విమానాలు, ఓడలను ద్వీప దేశం చుట్టు పక్కల మోహరించింది. తైవాన్‌కు ఉత్తర, దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో ‘జాయింట్ స్వోర్డ్-2024బీ’ పేరుతో కసరత్తులు చేపట్టినట్టు చైనీస్ మిలిటరీ ఈస్టర్న్ థియేటర్ కమాండ్ తెలిపింది. ఇది తైవాన్ స్వాతంత్ర్య దళాల వేర్పాటువాద చర్యలకు ఒక హెచ్చరిక అని పేర్కొంది. చైనా సార్వభౌమాధికారం, జాతీయ ఐక్యతను కాపాడటానికి ప్రస్తుత ఆపరేషన్ ఎంతో ముఖ్యమని వెల్లడించింది. కీలకమైన ఓడరేవు ప్రాంతాలను దిగ్బంధించడం, సముద్ర, భూ లక్ష్యాలపై దాడి చేయడం వంటి వాటిపై విన్యాసాలు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అయితే ఈ కసరత్తులు ఎప్పుడు ముగుస్తాయో అనే విషయంపై చైనా క్లారిటీ ఇవ్వలేదు. ఈ విన్యాసాల్లో నేవీ, ఎయిర్ ఫోర్స్, మిస్సైల్ కార్ప్స్ పాల్గొన్నాయి.

లైచింగ్ తే ప్రకటనపై ఆగ్రహం

గత వారం తైవాన్ జాతీయ దినోత్సవ వేడుకల సందర్భంగా అధ్యక్షుడు లై చింగ్-తే ప్రసంగం తర్వాత చైనా తన దూకుడు చర్యలను ఆపాలని అమెరికా, తైవాన్‌లు చైనాను కోరాయి. అంతేగాక తమ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తే తగిన చర్యలు ఉంటాయని, ప్రతిఘటన తప్పదని లైచింగ్ తే హెచ్చరించారు. తైవాన్‌కు ప్రాతినిధ్యం వహించే హక్కు చైనాకు లేదని స్పష్టం చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన చైనా మిలిటరీ డ్రిల్స్ ప్రారంభించింది. దీంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే చైనాతో చర్చలకు లై చింగ్-తే సుముఖత వ్యక్తం చేయడం గమనార్హం. పశ్చిమాసియా, ఉక్రెయిన్‌లో విభేదాలను తగ్గించడంలో బీజింగ్ కీలక పాత్ర పోషించాలని సూచించారు.


Similar News