Lebanon: లెబనాన్‌పై ఆగని ఇజ్రాయెల్ దాడులు.. రెండు రోజుల్లోనే 558 మంది మృతి

లెబనాన్‌పై వరుసగా ఐదో రోజూ ఇజ్రాయెల్ విరుచుకుపడింది. బీరూట్ సమీపంలో హిజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడి చేసింది.

Update: 2024-09-24 15:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లెబనాన్‌పై వరుసగా ఐదో రోజూ ఇజ్రాయెల్ విరుచుకుపడింది. లెబనాన్ రాజధాని బీరూట్ సమీపంలో హిజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా వైమాణిక దాడి చేసింది. హిజ్బొల్లా మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. దీంతో రెండు రోజుల్లోనే ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన వారి సంఖ్య 558కి చేరుకుంది. ఇందులో 50 మంది పిల్లలు, 94 మంది మహిళలు ఉన్నారు. మరో 1,835 మంది గాయపడ్డారని లెబనాన్ ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియాడ్ వెల్లడించారు. 2006లో ఇజ్రాయెల్-లెబనాన్ యుద్ధం తర్వాత ఇదే అతిపెద్ద దాడి కావడం గమనార్హం. 2006లో ఒక నెలపాటు జరిగిన ఘర్షణలో 1,000 మంది లెబనాన్ పౌరులు మరణించారు. ప్రస్తుతం లెబనాన్‌లో ఈ నెల 25 వరకు పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు లెబనాన్ నుంచి ఎదురుదాడి జరుగుతుందన్న సమాచారంతో ఇజ్రాయెల్‌లో వారం రోజుల పాటు ఎమర్జెన్సీ విధించారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) లెప్ట్ నెంట్ జనరల్ హెర్జి హలేవి మాట్లాడుతూ.. లెబనాన్‌లో తదుపరి దశల కోసం సైన్యం సిద్ధమవుతోందని తెలిపారు. 


Similar News