మరో సారి గద్దెనెక్కనున్న కేపీ శర్మ ఓలి!.. నేపాల్ ప్రధానిగా రేపు ప్రమాణస్వీకారం

నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి గద్దెనెక్కనున్నారు.

Update: 2024-07-14 12:57 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి గద్దెనెక్కనున్నారు. ప్రస్తుత ప్రధాని పుష్ప కమల్ దహాల్ అలియాస్ ప్రచండ విశ్వాస పరీక్షలో ఓడిపోవడంతో నేపాల్ ప్రధాని పీఠం కేపీ శర్మ ఓలిని వరించింది. ఓలిని ప్రధానిగా పొత్తు పక్షాలు అంగీకరించాయి. దీంతో ఓలిని కొత్త ప్రధానిగా నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ నియమించారు. రేపు ప్రధానిగా కేపీ శర్మ ఓలి మరో సారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. నేపాల్ లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఒప్పందం ప్రకారం ప్రధానిగా ఉన్న ప్రచండ అధికార బదలాయింపుకు అంగీకరించకపోవడంతో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్- యూనిఫైడ్ మార్క్సిన్స్ లెనినిస్ట్ తమ మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో ప్రచండ విశ్వాస తీర్మాణాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. శుక్రవారం జరిగిన విశ్వాస పరీక్షలో ప్రచండకు మద్దతుగా కేవలం 63 ఓట్లు మాత్రమే రావడంతో ఆయన ఓడిపోయారు.

దీంతో నేపాల్ లో కొత్త ప్రభుత్వానికి శ్రీకారం చుట్టారు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్.. నేపాల్ కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది. సభలో అతి పెద్ద పార్టీగా ఉన్న నేపాల్ కాంగ్రెస్ తో మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని సీపీఎన్- యూఎంఎల్ పార్టీ వారం కిందట ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అనంతరం ప్రచండకు మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందం అనంతరం నేపాలీ కాంగ్రెస్ చీఫ్ షేర్ బహదూర్ దేవ్‌బా, ఓలిని తదుపరి ప్రధానిగా ఆమోదిస్తున్నట్లు తెలిపారు. వీరి మధ్య ఒప్పందం ప్రకారం 18 నెలలు ఓలి, అనంతరం మిగిలిన కాలం దేవ్‌బా ప్రధాని పదవి చేపట్టనున్నారు. కాగా 275 మంది సభ్యులున్న నేపాలీ పార్లమెంట్ లో నేపాలీ కాంగ్రెస్ కు 89 సీట్లు ఉండగా.. సీపీఎస్-యూఎంఎల్ కి 78 సీట్ల బలం ఉంది. ఇరు పార్టీలు కలవడంతో ఆ సంఖ్య మెజారిటీ అవసరమైన 138 సీట్లు కంటే ఎక్కువగా ఉంది.

Tags:    

Similar News