US Elections: డెమోక్రటిక్‌ పార్టీ అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ సంతకం

డెమొక్రాట్‌ నాయకురాలు కమలా హారిస్‌ శనివారం అమెరికా అధ్యక్ష ఎన్నికలకు తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు

Update: 2024-07-27 05:16 GMT

దిశ, నేషనల్ బ్యూరో: డెమొక్రాట్‌ నాయకురాలు కమలా హారిస్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికలకు తన అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించిన దరఖాస్తుపై సంతకం చేశారు. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతా ద్వారా శనివారం తెలిపారు. ఆమె వ్యాఖ్యానిస్తూ, ఈ రోజు, నేను యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష పదవికి నా అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించే ఫారమ్‌లపై సంతకం చేశాను. ప్రతి ఓటును సంపాదించడానికి నేను కృషి చేస్తాను. నవంబర్‌లో మా ప్రజాశక్తి ప్రచారం గెలుస్తుంది అని ఎక్స్‌లో రాశారు. తమ పార్టీ విజయం సాధించడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

ఇటీవల అమెరికా తదుపరి అధ్యక్ష రేసు నుంచి ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెన్ వైదొలగిన తర్వాత వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ డెమోక్రటిక్ అభ్యర్థిగా ఎంపికయ్యారు. అంతకుముందు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కమలా హారిస్‌కు మద్దతు ప్రకటించారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో హారిస్‌ విజయం సాధించేందుకు తాను, అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్‌ ఒబామా చేయగలిగినదంతా చేస్తామని ఒబామా చెప్పారు. కమల అభ్యర్థిత్వంపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు ఇటీవల పలు వార్తలు రాగా, వాటికి తెరదించుతూ, ఒబామా ఆయన భార్య ఇద్దరు కూడా కమలా హారిస్‌‌కు బహిరంగంగా మద్దతు ప్రకటించారు. మరోవైపు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ కూడా తన ప్రచారంలో బిజీగా ఉన్నారు. నవంబరు 5న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్-కమలా హారిస్‌ మధ్య టఫ్ ఫైట్ జరగనుంది.

Tags:    

Similar News